‘ఇక్కడ ఎత్తైన ప్రదేశం కుతుబ్ మినార్‌నా బుర్జ్ ఖలీఫానా?’ అని అనౌష్క జైన్ ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్ వద్ద సాయం సంధ్యా సమయంలో ఉత్సాహంగా నిలబడి ఉన్న ముప్పై మంది మహిళల గుంపును అడిగింది. తమ స్మారక చిహ్నం వద్ద రాత్రి నడక కోసం గుమిగూడిన ఈ మహిళలు ఎత్తైన, గంభీరమైన నిర్మాణానికి దగ్గరగా వెళ్ళారు. వారి నవ్వు, సంతోషకరమైన కబుర్లు అక్కడి వాతావరణాన్ని మార్చివేశాయి. ఆ ఒకటిన్నర గంట నడకలో వీరంతా సరదాగా తమ సైట్ చరిత్ర గురించిన చర్చల్లో మునిగిపోయారు. ఒకరితో ఒకరు అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఈ అవకాశం కల్పించింది ‘లేడిస్ నైట్ వాక్’. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
‘లేడీస్ నైట్ వాక్’ను హెరిటేజ్ సంస్థను ఎన్‌రూట్ ఇండియన్ హిస్టరీ వ్యవస్థాపకురాలు అనౌష్క జైన్ నిర్వహిస్తున్నారు. ఇది 2019లో ప్రారంభించ బడింది. ఎన్‌రూట్ ఇండియన్ హిస్టరీ అనేది మహిళల నేతృత్వంలో నడుస్తున్న ఓ సంస్థ. ఇది ఢిల్లీలోని లోధీ గార్డెన్, కుతుబ్ మినార్, సఫ్దర్ జంగ్ సమాధితో పాటు మరిన్ని ప్రదేశాలకు హెరిటేజ్ వాక్‌లను నిర్వహిస్తుంది. లేడీస్ నైట్ వాక్ మాత్రమే కాకుండా ‘రాత్ కె అఫ్సానే’ అని పిలిచే నైట్ వాక్‌లు, డిజిటల్ టూర్లు, మార్నింగ్ వాక్‌లు, కస్టమ్-డిజైన్డ్ వాకింగ్ టూర్‌లను కూడా నిర్వహిస్తుంది.
వారసత్వం పట్ల ప్రేమతో
‘మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హెరిటేజ్ వాక్‌లను ప్రారంభించడంలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే వారికి సురక్షితమైన స్థలాన్ని సృష్టించడం. దాంతో వారు రాత్రిపూట ఈ బహిరంగ ప్రదేశాలను ఆస్వాదించగలరు. అలాగే కమ్యూనిటీ భావాన్ని పెంపొందిస్తుంది. చారిత్రాత్మక స్మారక చిహ్నాలను స్వేచ్ఛగా అన్వేషించడానికి వారికి అధికారం ఇస్తుంది” అని అనౌష్క చెప్పారు. చారిత్రక వారసత్వం పట్ల ఉన్న ప్రేమతో ఆమె ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ అండ్స్ మాస్టర్స్ చేసింది. అంతేకాదు ఆర్ట్ హిస్టరీలో డిప్లొమా కూడా చేసింది. తర్వాత ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌లో ఇంటర్న్ చేసింది. అక్కడ ఆమె యునెస్కోతో కలిసి జానపద సంపద విభాగంలో పనిచేసింది. వారసత్వం పట్ల ఉన్న ప్రేమ, విజ్ఞానం, అకడమిక్ చరిత్ర మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలనే కోరికే ఆమె 2019లో భారతీయ చరిత్రలో ప్రవేశించడానికి దారితీసింది. దాదాపు 30 మంది మహిళలతో ఇంటర్న్‌లు, పరిశోధనలు, సోషల్ మీడియా, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మొదలైనవి నిర్వహిస్తున్నారు.
అసలు వస్తారా అనే సందేహంతో
‘ఈ హెరిటేజ్ వాక్‌లను ప్రారంభించమని నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అడిగితే నేను కాస్త ఆలోచించాను. అయితే దాని నుండి ఆదాయం రాదనే ఉద్దేశంతో వెనకడుగు వేస్తున్నాని చాలా మంది అనుకున్నారు. అయితే నా ఆందోళన డబ్బు గురించి కాదని వారికి చెప్పాను. ప్రజలు ఈ హెరిటేజ్ వాక్‌లకు అసలు వస్తారా అనే సందేహం ఉండేది. స్మారక ప్రదేశాల గురించి అవగాహన, చుట్టుపక్కల ప్రాంతంతో పరిచయం, పర్యటనను సమన్వయం చేయడం, నిర్వహించడంలో నైపుణ్యం అవసరం కాబట్టి ఈ నడకలను ఏర్పాటు చేయడం చాలా సవాలుగా ఉంటుందని భావించాను. అంతేకాకుండా అకడమిక్ టూరిజం చాలా కొత్తది, సంక్లిష్టమైనది’ అంటున్నారు ఆమె.
మహిళలకు సేఫ్ స్పేస్
తాము నైట్ వాక్ ప్రారంభించినప్పుడు అక్కడ ఎంత మంది మహిళలు ఉంటారు, వెలుతురు బాగా ఉంటుందా, గ్రూప్ ఎంత పెద్దది అని అడిగే మహిళల నుండి చాలా ప్రశ్నలు, కాల్స్ వచ్చేవని ఆమె గుర్తుచేసుకుంది. ‘స్మారక ప్రదేశాలు రాత్రి సమయంలో అంత సురక్షితం కాదు, ముఖ్యంగా మహిళలకు. నేను నాలుగేండ్లు వ్యాపారంలో ఉన్నాను. కానీ అర్థరాత్రి తెలియని ప్రదేశానికి వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. మహిళలు స్వేచ్ఛగా నగర వారసత్వాన్ని ఆస్వాదించగలిగే స్థలాన్ని సృష్టించే లక్ష్యంతో మహిళల నడకను ప్రారంభించాలనే ఆలోచనను నాలో ఇది రేకెత్తించింది. యువతుల నుండి అరవై ఏండ్ల మహిళల వరకు వీటికి హాజరవుతారు. ఈ నడకలు నెలకు రెండుసార్లు ఉంటాయి. టిక్కెట్‌తో పాటు ప్లస్ కూడా వస్తుంది ఒకటి. కాబట్టి మహిళలు తమ స్నేహితులను లేదా వారు కోరుకున్న వారిని (మహిళలు మాత్రమే) వెంట తీసుకురావచ్చు. ఒక్కో టికెట్ ధర రూ. 600 ఉంటుంది. నడకలు సాధారణంగా సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు ఏర్పాటు చేయబడతాయి’ అని జైన్ తెలియజేశారు.
నడిపించే తీరు నచ్చింది
గురుగ్రామ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న 27 ఏండ్ల చరిత్ర, కళా ప్రేమికురాలు రుచితా చవాన్ లేడీస్ నైట్ వాక్ గురించి తెలుసుకుంది. ‘మొదటిసారి నడకకు వెళ్ళినప్పుడు నేను నగరానికి కొత్త. వారసత్వం పట్ల తమకున్న అభిరుచిని పంచుకోవడానికి వివిధ రంగాలకు చెందిన యువతులు తమ కుమార్తెలు, వృద్ధులతో కలిసి రావడం నాకు గుర్తుంది’ అని ఆమె చెప్పింది. రుచిత అనేక హెరిటేజ్ వాక్‌లలో పాల్గొంది. కానీ అన్నింటికంటే పర్యటనకు సంబంధించిన ప్రదేశాలు చూడడం ఆమెకు నచ్చింది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణంగా ఆమెకు అనిపించింది. ‘అనౌష్క ఈ హెరిటేజ్ సైట్‌లను నడిపించే తీరు నాకు బాగా నచ్చింది. మహిళలు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా నడకలను నిర్వహించడంలో ఆమె చేస్తున కృషి అభినందనీయం’ అని ఆమె జతచేస్తుంది.
యువతకు పరిచయం చేయాలి
ఇటీవలె సంస్థ ‘బాదాస్ బేగం’ పాద యాత్రలను కూడా ప్రారంభించింది. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. ఈ యాత్రలో ఎవరైనా హుమాయున్ సమాధి, చాందినీ చౌక్‌తో పాటు మహిళలచే నిర్మించబడిన లేదా రూపొందించబడిన వారసత్వ ప్రదేశాలకు తీసుకువెళతారు. ఇది మహిళా వాస్తుశిల్పుల గురించి తెలుసుకునే ప్రయత్నం అని ఆమె అంటుంది. ఈ సంస్థ ప్రతి శనివారం, ఆదివారం ప్రజలందరికీ ఉదయం, సాయంత్రం ప్రత్యేక నడకలను కూడా నిర్వహిస్తుంది. మొత్తంగా ప్రతి నెల 15 హెరిటేజ్ వాక్‌లను నిర్వహిస్తుంది. ఇన్‌సైడర్, బుక్‌మైషో, టౌన్ స్క్రిప్ట్ వంటి వెబ్‌సైట్ నుండి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సంస్థ ఢిల్లీలో మాత్రమే పనిచేస్తోంది. అయితే కోల్‌కతా, మీరట్, కాశ్మీర్‌కు కూడా విస్తరించాలని యోచిస్తోంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 75కి పైగా లేడీస్ నైట్ వాక్‌లను నిర్వహించింది. యువతులకు వారసత్వ సంపదని పరిచయం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఎందుకంటే వయసు పెరిగితే దాని ప్రాముఖ్యతను గుర్తించడం కష్టం. అందుకే సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం రియల్-టైమ్ లెర్నింగ్, స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ వంటి అభ్యాస విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఎదురుదెబ్బ మహమ్మారి
ఆమె ఇప్పటివరకు చేసిన ప్రయాణం అంత సులభం కాదు. కరోనా ఆ సమయంలో ఆఫ్‌లైన్ వాక్‌లను నిర్వహించలేకపోయినప్పటికీ డిజిటల్ వాక్స్ అనే మరో విభాగాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఈ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ డిజిటల్ నడకల సమయంలో ఒక నిర్దిష్ట సైట్, ఆర్కైవల్ చిత్రాలు చూపిస్తారు. ఈ చిత్రాలను ఉపయోగించి ఆమె చర్చలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే వారిని ఉత్సాహపరచడానికి క్విజ్‌లను కూడా నిర్వహిస్తుంది. ‘ఆ సమయం నా వ్యాపారం గురించి మరింత లోతుగా ఆలోచించే అవకాశాన్ని ఇచ్చింది. నేను దాన్ని మరింతగా విస్తరింపజేశాను’ అని ఆమె జతచేస్తుంది.