పిల్లగాడు ఆటో నడ్పుతడు నల్గురన్నదమ్ములంటా నల్గురి పొత్తుల నాల్గెకరాల ఎవుసం
పెద్దాయన బొంబాయ్ల నీళ్ళు తాగే గోడలకు కాపలుంటడంటా!
నడ్పాయన పట్నంలో కూశింత జాగున్నోడంటా
ఈళ్ళిద్దరే ఊర్ల ఎవుసాన్ని భుజాల నిండా దాస్కుంటారు!
మేనమామ నోటినిండా
పిల్లగాడు బుద్ధిమంతుడే
ఈపొద్ది దినం లగ్గపత్రిక రాసుకుందామని
హన్మండ్ల కాడ ఆలోచన మర్రిచెట్టైంది!
పెండ్లంటే పది కాలాలు సల్లగుండాలే
బలం సూసే అయ్యవారి మాటే మాకూ బలమైంది
పొద్దిమీకి దాక దేవ్లాడి దేవ్లాడి బలం దొర్కంగానే
కొత్తబట్టల్ల లగ్గపత్రిక బొట్టువెట్టుకున్న ముత్తైదువైంది!
జీవితం తప్పుల పుస్తకం కావొద్దని
లగ్గపత్రికలో పేరు కింద పేరు రాసుకొని
ఆడీడ దూరపు సుట్టాలకు లగ్గపత్రిక అందకున్నా
పెండ్లికొచ్చే మనసులు ఇప్పుడు లేరులే!
బడిబాసండ్ల కాడ,పెండ్లిబట్టల కాడ
పెద్దమన్సుల మాట బ్యారమాడకుండా
కల్లు దుకాణం దాక నడిపిస్తుంది!
పేదరికం కనబడకుండా పెండ్లైతే చేశినం
సంసారమే నల్గురు పేరువెట్టకుండా చూసుకోవాలంటూ
అక్క గద్వను బత్మిలాడి పంపిన అమ్మ నాయిన ఎల్లిపోయిరి!
బావ ఆటో నిండా పేపరు ప్రపంచాన్ని నింపుకొని ఊరూర వార్తైయ్యోది!
బతుకుబండిని సగంలోనే వొదిలేసి
ఏ దిక్కున సుక్కైండో!
ఇప్పుడు నా పిల్లను కూడా ఓ ఇంటికియ్యాలే
పిల్ల పెండ్లికి లగ్గపత్రిక రాసుకోవాలని
అక్క ఫోన్ చెయ్యగానే
దూలానికి కట్టిన అక్కబావల లగ్గపత్రిక
ఊసి గుండెల మీద పడ్డది!
– చిగురాల్‌పల్లి ప్రసాద్, 8074272531