నవతెలంగాణ – చిన్నకోడూరు
ప్రమాదవశాత్తు 11కేవి విద్యుత్ తీగలు లారీకి తగిలి లారీ హెల్పర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని మైలారం సబ్ స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం వరకు ట జరిగింది. లారీ డ్రైవర్ అల్లా భకేష్ మరియు చిన్నకోడూరు ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి కి చెందిన ఖలీంషా సద్దాం హుస్సేన్(31) లారీ హెల్పర్ గా జీవనం సాగిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి గ్రామ శివారులో అనంతగిరి రిజర్వాయర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ కి కేబుల్ వైరును లారీ నెం. టిఎన్ 28బిఎ 7450 గల వాహనంలో తీసుకుని వస్తుండగా మైలారం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డు పై 11కేవి విద్యుత్ వైర్లు లారీ లోని కేబుల్ వైరును తాకుతుందని డ్రైవర్ భకేష్ గమనించి హెల్పర్లు సద్దాం హుస్సేన్, సతీష్ కుమార్ లకు చెప్పగా ఇద్దరు క్రిందకి దిగినారు. లారీ కుడి వైపు సతీష్ కర్రతో విద్యుత్ తీగలను లేపే ప్రయత్నం చేస్తున్నా విద్యుత్ తీగలు పైకి లేవలేదు. అదే సమయంలో లారీ ఎడమ వైపు ఉన్న సద్దాం హుస్సేన్ లారీ ట్రాలీని పట్టుకొని నిల్చోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ భకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.