కళ్ళలో వత్తులు మొరాయించాయి ….
కన్నీరు నిండుకుని ….
నింగిలోని మేఘాలు కళ్లకింద చేరాయి
పొయ్యిలో కరకర మండాల్సిన
ఎండుకట్టెలు జాలిగా చూస్తున్నాయి
నా బతుకు చిత్రం
బహుముఖ చిత్రాలయ్యాయి ….!
ఏటిలోన నా చిత్రం సూరీడు చెరిపేశాడు
చింత చెట్టు నా నీడను రాకాసిలా మింగేసింది
వర్షానికి తడిసి ముద్దైన నా ప్రాణంలో
కొత్త మొలకలొస్తాయన్న ఆశ – ఆకాశాన్ని
తాకకముందే – కుండపోతలో కొట్టుకుపోయింది
ప్రకతికీ నా బతుకు భారమైందేమో
కాళ్ళ కింద మట్టి బీటలు వారకముందే ..
గుండెజారి ఏటిలో పడ్డాను !
అందరికి కూడు పెట్టిన నా చేతులు ఇప్పుడూ
ఏవేవో జలరాసులకు కూడు గా …
ఆపన్నహస్తం కోసం అలసిన కళ్ళు
నిశ్చింతగా శాశ్వత ఒడిలోకి చేరుతూ
పైకి చూశాయి చందమామ పైనున్న
ద్యాసలో ఇసుమంతైనా భూమ్మీద ఉంటే
ఆధునికత ప్రయోగిస్తే – యువత ముందుకు రాదా
నిరంతర సేద్యం పచ్చగా ముందుకు సాగదా ?
జై భారత్! జై కిసాన్!
– న్యాలకంటి నారాయణ, 9550833490