లీడర్లు కలిసిండ్రు.. క్యాడర్‌ను మరిసిండ్రు..

Leaders are together.. Cadre is forgotten..– ప్రచారానికి దూరంగా ఎమ్మెల్సీ అనుచరులు
– గులాబి కోటలో ఆరని మంటలు
– అసంతృప్తి వాదులతో ఎమ్మెల్సీ సమాలోచనలు
– దసరా నాటికి సమస్య పరిష్కారంపై దృష్టి
నవ తెలంగాణ మహబూబాబాద్‌
గులాబీ కోటలో అసంతృప్తి మంటలు రగులుతూనే ఉన్నాయి. నాయకుల మధ్య వైరం ముగిసినప్పటికీ కార్యకర్తల్లో కయ్యం కొనసాగుతోంది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ను తిరిగి అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించి బీఫారం ఇచ్చినప్పటికీ అసమ్మతివాదులు ఏ మాత్రం తగ్గడం లేదు. తమను అనేక అవమానాల పాలు చేసి గాలికి వదిలేసిన ఎమ్మెల్యే శంకర్‌ గెలుపు కోసం ఎలా పనిచేయాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ వరుసగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్‌ కొట్టి, మంత్రి పదవి సాధించాలనే జోరు మీద శంకర్‌ నాయక్‌ ఉన్నారు. అయితే నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌, మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు మధ్య ఉన్న విభేదాలు పలు సందర్భాల్లో బట్టబయలయ్యాయి. గతేడాది దసరా సందర్భంగా ఎంపీ అనుచరులు కట్టిన బ్యానర్లను ఎమ్మెల్యే అనుచరులు చించి వేశారు. దాంతో ఎంపీ అనుచరుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా జరిగిన గులాబీ పార్టీ ధర్నాలో ఎంపీ, ఎమ్మెల్యే పరస్పరం మైక్‌ విషయంలో గొడవపడ్డారు. ఈ గొడవ సద్దుమణిగిందనుకునే లోపే ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. దానికి తోడు మానుకోటలో తెలంగాణ ఉద్యమాకారులు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై సమావేశాల్లో బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. మూడు నెలలుగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు అనుచరులు మహబూబా బాద్‌, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ ప్రజా సంఘాల పార్టీ అనుబంధ సంఘాల నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. అనూహ్యరీతిలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ టికెట్‌ సాధించి బీఫారం తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ నాయకులను కలిసి వారి మద్దతు కోరారు. ఇందుకు వారు కూడా సంఘీభావం తెలిపి ప్రచారంలో పాల్గొంటామని హామీనిచ్చారు.
ఎమ్మెల్యే గెలుపునకు ప్రయత్నించేనా?
మహబూబాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి సత్యవతి రాథోడ్‌, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు నియమితులయ్యారు. ఇల్లందులో నవంబర్‌ 1న సీఎం బహిరంగ సభ ఉన్నందున ఎంపీ మాలోత్‌ కవిత అక్కడి ఏర్పాట్లలో ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఆ ముగ్గురు ఇక్కడ ప్రచారంలో పాల్గొనే పరిస్థితి లేదు. కాగా, ఇక్కడ వారి అనుచరులు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ గెలుపు కోసం ఏ మేరకు ప్రయత్నం చేస్తారు.. ప్రచారం చేస్తారా.. లేదా.. అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవల జరిగిన రెండు, మూడు ప్రచార సభల్లో ఎంపీ, ఎమ్మెల్సీ హాజరై మాట్లాడారు. ఆ సభలూ సమావేశాలకు అసంతృప్తివాదులు, ఉద్యమకారులు, ఎమ్మెల్సీ అనుచరులు హాజరు కాలేదు. కొంతమంది కౌన్సిలర్లు కూడా డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని శంకర్‌ నాయక్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
కక్ష సాధింపులకు పోతే పరిస్థితేంటీ?
అప్రమత్తమైన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు తన అనుచరులు, ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు. వారంతా తమకు జరిగిన అవమానాలను ఏకరువు పెట్టారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ తమ వార్డు సమావేశాల్లో అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే తమకు నిధులు కేటాయించకుండా అడ్డుకున్నారని, కేసులు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. భవిష్యత్తులోనూ ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు చేపడితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు తమకు స్పష్టమైన హామీ వస్తే తప్ప ఎమ్మెల్యేకు అనుకూలంగా ప్రచారంలోకి దిగేది లేదంటూ తేల్చి చెప్పారు. నాయకులందరూ కలిసిపోయారని, తమ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దసరా తర్వాత అసంతృప్తి వాదులందరినీ ఏకతాటి పైకి తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ భావి స్తున్నట్టు సమా చారం. కాగా ఎమ్మెల్సీ తక్కెళ్ళ పల్లి రవీందర్‌రావు బుజ్జగింపు చర్చలు ఏ మేరకు పనిచేస్తాయి? అసంతృప్తి నేతలు, ఉద్యమకారులకు ఎలాంటి హామీలు ఇస్తారనేది వేచి చూడాల్సిందే.