– అశేష జనవాహిని నడుమ కొలువుతీరిన సమ్మక్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ములుగు
సమ్మక్క, సారలమ్మ గద్దెలపైకి కొలువుదీరడంతో మేడారం మహా జనసంద్రంగా మారింది. గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి వడ్డె కొక్కెర క్రిష్టయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఇతర వడ్డెలతో కలిసి భారీ భద్రత నడుమ సమ్మక్కను తీసుకొని బయలు దేరారు. సమ్మక్కకు ఆహ్వానం పలుకుతూ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఆదివాసీ యువకులు, రోప్ పార్టీ భద్రతా వలయంలో మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, గతంలో జాతర ప్రత్యేకాధికారులు ఆర్వీ కర్ణన్, కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, శ్రీజ, రాధికా గుప్తా, అడిషనల్ ఎస్పీ సంకీర్త్, అడిషనల్ ఎస్పీ సదానందం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ బయలుదేరారు. చిలుకలగుట్ట కింద ఆదివాసీ యువతీయువకులు గిరిజన వాయిద్యాలైన డోలు వాయిస్తూ, కొమ్ము వూదుతూ వాటికనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. సమ్మక్క గుట్టపై నుంచి కిందకు తీసుకొచ్చే దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, రాత్రి సమ్మక్కను ప్రధాన వడ్డె కొక్కెర క్రిష్ణయ్య,, సిద్దబోయిన మునేందర్, చందా బాబురావు, సిద్దబోయిన మహేష్, సిద్దబోయిన లక్ష్మణ్ తదితర వడ్డెలు గద్దెలపై ప్రతిష్ఠించారు. అనంతరం మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్లు శ్రీజ తదితరులు పూజలు నిర్వహించారు.
రేపు వన ప్రవేశం
మేడారం మహాజాతరలో చివరి ఘట్టం వనప్రవేశం శనివారం జరుగనుంది. శనివారం సాయంత్రం 5.00 గంటల ప్రాంతంలో వడ్డెలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని వెళ్లడమే మహాజాతరలో చివరి అంకం. వనప్రవేశంతో జాతర ముగిసిపోతుంది.
నేడు గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డి రాక
మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించడానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రానున్నారు. గవర్నర్ ఉదయం 10.00 గంటలకు, సీఎం మధ్యాహ్నం 12.00 గంటలకు మేడారానికి చేరుకోనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర మంత్రులు రానున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారానికి రానున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు.
మేడారం జాతరలో.. వేలాదిగా వెలిసిన గుడారాలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కన్నుల పండుగగా వైభవంగా కొనసాగు తోంది. వనదేవతలను దర్శించు కోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్ర, ఛత్తీస్‌గడ్, ఒడిశా, కర్నాటక.. తదితర రాష్ట్రాల నుండి ఆదివాసీలు, ఇతరులు ప్రజలు పెద్ద ఎత్తున మేడారానికి తరలివచ్చారు. కొంతమంది అటవీ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోగా మరికొంతమంది జాతర పరిసర ప్రాంతాల్లోని మైదానాల్లో గుడారాలు వేసుకొని ఉన్నారు. బుధవారం సారలమ్మ, గోవిందరాజులు పగిడిద్దరాజులు గద్దెకు చేరుకోగా గురువారం సమ్మక్క దేవర గద్దెకు చేరుకుంది. ప్రజలు పెద్ద ఎత్తున మేడారానికి చేరుకొని గుడారాల్లో నివాసం ఉంటున్నారు. కొంతమంది మూడు రోజులపాటు మేడా రంలో ఉంటూ మొక్కులు చెల్లించుకుం టున్నారు. దాంతో పరిసర ప్రాంతాలన్నీ గుడారాలతో నిండిపోయాయి.