– రైతులకు నష్టం జరగకుండా చూడాలి
– ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
– నిజానిజాలను ప్రజల ముందుంచాలి : రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, నాగయ్య, జూలకంటి
– ప్రాజెక్టును పరిశీలించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ బృందం
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో ప్రధానంగా చర్చనీయాంశమైన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నిర్మాణ లోపంపై న్యాయ విచారణ చేపట్టాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టును సోమవారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి.సాగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మహాదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామంలో విలేకర్ల సమావేశంలో వీరయ్య మాట్లాడారు. ”దేశ చరిత్రలో నీటిపారుదల రంగానికి అత్యధిక నిధులతో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీ పూర్తైన కొద్ది కాలానికే కుంగిపోవడం నిర్మాణ లోపమా? డిజైన్ లోపమా? నాణ్యతా లోపమా? ఏమి జరిగిందో నిపుణులతో న్యాయవిచరణ చేపట్టాలి” అని డిమాండ్ చేశారు. తక్షణమే నిజానిజాలు తేల్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానై నిర్మించడం వల్లే మూడు పిల్లర్లు కుంగాయని అన్నారు. కమీషన్ల కోసం రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం కట్టి ప్రజాధనాన్ని వృథా చేశారని చెప్పారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రి హయాంలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంతో 100 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని వ్యాప్‌కో కంపెనీ అధ్యయనంలో తెలిపిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే వ్యాప్ కో కంపెనీ అధ్యయనంలో 110 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఖర్చు అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అధ్యయనంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టులో పూర్తి నీటిమట్టం ఉన్నప్పుడు పిల్లర్లు కుంగితే సమస్య తీవ్రత ఎక్కువ ఉండేదన్నారు. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇదంతా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఆరోపించారు. లక్ష కోట్లతో నిర్మాణం చేపట్టినప్పుడు.. అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆలోచన చేసి.. నిపుణుల అభిప్రాయం తీసుకొని నిర్మించాల్సి ఉండేదని అన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జి.నాగయ్య మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టి నిజా నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. నిపుణులు, ఇంజినీర్ల అభిప్రాయాలను తోసిపుచ్చి కేసీఆర్ అన్నీ తానై ప్రాజెక్టును డిజైన్ చేశారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలను నీటిపాలు చేశారన్నారు. మే చివరి వారంలో ప్రాణహిత పై నుంచి వచ్చే నీటిని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు.
నిపుణుల అధ్యయనం పూర్తి అయ్యేసరికి పుణ్యకాలం పూర్తవుతుందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం 10 గ్రామాలను హుటాహుటిన తరలించారని గుర్తు చేశారు. ప్రజలు ఏడుస్తున్నా కనికరించలేదన్నారు. పేరు కోసం పాకులాడుతూ ప్రజల ఉసురు పంచుకున్న నాయకుడెవరు బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలేం రాజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్, నాయకులు సూదుల శంకర్, ఆకుదారి రమేష్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.