కమ్యూనిస్టులులేని చట్ట సభలు…విగ్రహాలులేని దేవాలయాలు

– కమ్యూనిస్టుల ప్రభావం తగ్గబట్టే అప్రజాస్వామిక పాలన
– నిత్యం ప్రజల గురించే ఆలోచించే కామ్రేడ్లను ఆదరించండి
– ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒంటరిగానే పోటీ
– రాష్ట్ర వ్యాప్తంగా 24 సీట్లలో పోటీకి దిగుతున్నాం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
– మన ఓట్లు మనవాళ్లకే వేసి సత్తా చాటుకుందాం
– 8న సత్తుపల్లిలో సీపీఐ(ఎం) అభ్యర్థి నామినేషన్‌
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
కమ్యూనిస్టులులేని చట్ట సభలు విగ్రహాలులేని దేవాలయాలుగా మారాయని, ప్రజల గురించి ఆలోచించే వారే లేరని, సరైన చట్టాలు తీసుకురావడం లేదని, కమ్యూనిస్టుల ప్రాభల్యం తగ్గడం వల్లే ప్రజాస్వామ్యానికి తీవ్రమైన విఘాతం కలుగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ అన్నారు. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉన్నప్పుడు చట్ట సభలు ఇలా ఉండేవి కావన్నారు. కమ్యూనిస్టుల ప్రాభల్యం తగ్గిన నాటినుంచి దేశంలో, రాష్ట్రంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతోందని సుదర్శన్‌ అన్నారు. శనివారం సత్తుపల్లిలో ఆ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి సుదర్శన్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుదర్శన్‌ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలోచించే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలన్నారు. ఈ నినాదంతోనే ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. కమ్యూనిస్టులు బలహీన పడితే దేశం అథోగతి పాలవుతుందని, అరాచకం రాజ్యమేలుతుందని సుదర్శన్‌ స్పష్టం చేశారు. ఎర్రజెండానే పీడిత ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఏ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. మతో న్మాదులతోనే మన పోరాటమన్నారు. ఈ నేపధ్యంలో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీ బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసి సీపీఐ(ఎం) తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా 24 స్థానాల్లో ఒంటరిగానే పోటీకి దిగుతుందన్నారు. ఇప్పటికే 17స్థానాలను ప్రకటించడం జరిగిందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మనపార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులకే మనం ఓట్లు వేసి మన సత్తా ఏంటో చూపించుకుందా మన్నారు. అలా కాకుండా మనం గెలిచే అవకాశం లేదని పలానా పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని, పలానా పార్టీ అభ్యర్థి గెలవాలని మన ఓట్లను వేరొకరికి వేయడం వల్ల మన బలం తగ్గటానికి కారణమవుతుందన్నారు. ఈసారి అలా జరక్కూడదన్నారు. నిరంతరం శ్రామికవర్గం, ప్రజల సమస్యలపై ఉద్యమించే మన అభ్యర్థుల గెలుపుకు విశ్రవించకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. డబ్బుకు ఆశపడి విలువైన ఓటును తాకట్టుపెట్టే పరిస్థితి నుంచి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. డబ్బుకు ఆశపడి ఓట్లేస్తే ఐదేండ్ల పాటు మన ఓటుకు వాళ్లిచ్చే విలువ అర్థ రూపాయి కూడా పడదన్నారు. ఈ అర్థ రూపాయికి మన విలువైన ఓటును అమ్మకోవాలా అనే విషయాలను ప్రజలు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. 8వ తేదీన సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి సీపీఐ(ఎం) అభ్యర్థి నామినేషన్‌ వేస్తున్నట్లు పోతినేని, నున్నా తెలిపారు. జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా నాయకులు మాదినేని రమేశ్‌, చలమాల విఠల్‌రావు, జాజిరి శ్రీనివాసరావు, శీలం సత్యనారాయణరెడ్డి, అర్వపల్లి జగన్మోహనరావు, అయినాల రామలింగేశ్వరరావు, గాయం తిరుపతిరావు, నల్లమోతు మోహనరావు, మాదాల వెంకటేశ్వరరావు, తన్నీరు కృష్ణార్జునరావు, మల్లూరు చంద్రశేఖర్‌, కొలికపోగు సర్వేశ్వరరావు, ఐద్వా జిల్లా నాయకురాళ్లు జాజిరి జ్యోతి, మస్తానమ్మ, తన్నీరు కృష్ణవేణి, కుమారి, మిట్టపల్లి నాగమణి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పఠాన్‌ రోష్ని, నాయకులు సత్తెనపల్లి నరేశ్‌, బాల బుచ్చయ్య, ఐనంపూడి సనందనరావు, మోరంపూడి వెంకటేశ్వరరావు, మోరంపూడి వెంకటరావు, అంజయ్య, ఏలిగనేని రామారావు, యండమందల వెంకటేశ్వరరావు, గుడిమెట్ల బాబు, పకీరమ్మ, వేపులపాటి కుమారస్వామి, బండి వేలాద్రి పాల్గొన్నారు.