మూఢనమ్మకాలు వీడాలి 

మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డా. బైరి నరేష్ పిలుపు

– కాటాపూర్ సందర్శించి యువతరానికి అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ -తాడ్వాయి: మూఢనమ్మకాలు వీడాలని, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ అన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన ప్రచారంలో భాగంగా గురువారం ములుగు జిల్లా సమ్మక్క- సారమ్మ తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామం సందర్శించి యువతతో “మూఢనమ్మకాలు వీడుదాం.. శాస్త్రీయంగా జీవిద్దాం” అని ప్రతిజ్ఞ చేయించారు. యువతకు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు బైరి నరేష్, ములుగు జిల్లా అధ్యక్షులు సందుపట్ల రవి లు మాట్లాడుతూ మూఢనమ్మకాలు వీడాలని కోరారు. దేనిని గుడ్డిగా నమ్మను అని మూఢనమ్మకాలు వదిలేస్తాను అని, కుల మతాలకు స్థానం లేకుండా శాస్త్రీయంగా జీవిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక యువతీ యువకులు, విద్యావంతులు ఈ ప్రాంతంలోని మూఢనమ్మకాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా హాస్పిటల్ వెళ్ళాలని కోరారు. చెడుపు, చిలైలంగి, బాణామతి, చేతబడి పేరుతో అమాయక ప్రజలు, నమ్మి మోసపోవద్దు అన్నారు. మంత్ర తంత్రాలు ఉండవు. ప్రజలలో ఉన్న  నమ్మకాలను ఆసరాగా చేసుకొని దొంగ మాంత్రికులు మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు వారు, వైద్యశాఖ వారు మూఢనమ్మకాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఢనమ్మకాలతో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటు అని ఆవేదన వ్యక్తం చేసారు. త్వరలో ఏజెన్సీ ప్రాంతాల్లో యువతకు సామాజిక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలిసి పని చేయాలి అనుకునే వారు 7013160831 కి సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు సందుపట్ల రవి, నాయకులు మల్లికార్జున్, శ్రీరాం రామారావు, సందీప్, తమ్మల సమ్మయ్య గౌడ్, లంజపెల్లి రాము, బాసాని ముకుందం,  శివ, న్యాతాని రామ్మోహన్, కూర రాజు, సంతోష్, రామన్న, అచ్చుత్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.