మహిళలు సాంకేతిక నైపుణ్యాలను కలిగి ఉంటే సామాజిక అడ్డంకులను ఛేదించగలరు. స్వాతంత్య్రం పొందగలరు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో తమ గొంతులను నొక్కి చెప్పగలరు అని దృఢంగా నమ్మిన బురాగోహైన్ ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ అనే సంస్థను స్థాపిం చారు. ముఖ్యంగా అట్టడుగు యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ఆధ్వర్యంలో బాలికలు, మహిళలకు సాంకేతికతను ఉపయోగించుకొని జీవితంలో ఎలా స్థిరపడాలో శిక్షణ ఇస్తున్నారు. వారిలో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేస్తున్న ఆ సంస్థ గురించి మరిన్ని విశేషాలు…
బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని ఓరప్ గ్రామానికి చెందిన 23 ఏండ్ల పూనమ్ కుమారి తన కమ్యూనిటీలో చదువు పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచింది. చదువు కోసం పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. చదువు మానేసి పెండ్లి చేసుకొమ్మని కుటుంబం ఆమెను ఒత్తిడి చేసేది. దాంతో ఆమె 2018లో 10వ తరగతిలో ఫెయిల్ అయ్యింది. ఆ సమయంలోనే గ్రామంలోని ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతున్న స్థానిక సాంకేతిక కేంద్రంలో ఫెలోగా చేరింది. లింగ అంతరాన్ని తగ్గించి, విద్య, శిక్షణల ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, బాలికలకు సాధికారతను అందించే లాభాపేక్ష రహిత సంస్థ ఇది. అందులో ఏడాది శిక్షణ పొందిన తర్వాత కుమారి తన పాఠశాల విద్యను కొనసాగించింది. ఈ రోజు ఆమె ఆ సంస్థలో కమ్యూనిటీ లీడర్‌గా కూడా ఎదిగింది. యువతులకు, మహిళలకు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు, లింగ వివక్షపై అవగాహన కల్పిస్తూ, వారు వారి స్థానాన్ని తిరిగి పొందడంలో ఈ సంస్థ సహాయపడుతుంది.
సాధికారత సాధనంగా
ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీని లింగ సమానత్వం కోసం నిత్యం తపించే న్యాయవాది గాయత్రి బురగోహైన్ 2007లో స్థాపించారు. మహిళల జీవితాలను రూపొందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆమె గుర్తించారు. సాంకేతిక రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆమె ప్రత్యక్షంగా అనుభవించారు. అస్సాంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత కొన్నేండ్లు ఆమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదగడానికి, నేర్చుకోవడానికి ఎన్ని అడ్డుంకులు ఉన్నాయో ఆమెకు అప్పుడే అర్థమైంది. అందుకే స్త్రీలు, బాలికలు, ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితుల నుండి వచ్చిన వారికి సాంకేతికతను అందుబాటులో వుంచాలని ఆమె నిర్ణయిం చుకున్నారు. ఆ ఆలోచనతోనే ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీని ప్రారంభించారు.
హక్కులపై అవగాహన
మహిళలు సాంకేతిక నైపుణ్యాలను కలిగి ఉంటే సామాజిక అడ్డంకులను ఛేదించ గలరు, స్వా తంత్య్రం పొందగలరు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో తమ గొంతులను నొక్కి చెప్పగలరు అని దృఢంగా నమ్మిన బురాగోహైన్ ఈ సంస్థను స్థాపించారు. ఏండ్లుగా ఇది మూడు ప్రధాన విషయాలపై పని చేస్తుంది. ఒకటి యంగ్ ఉమెన్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్. ఇది 14 నుండి 19 ఏండ్ల వయసు గల బాలికలకు వారి హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, 21వ శతాబ్దపు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన బాలికల్లో సైన్స్, టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. వెనుకబడిన, అట్టడుగు స్థాయిల యువతకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. జార్ఖండ్‌లోని గిరిడి, పాట్నా, బీహార్‌లోని ఇతర ప్రాంతాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది.
పరిజ్ఞానం పెంచుకొని
‘ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీలో జట్టులో భాగమయ్యే వరకు మేము సమస్యలు ఎదుర్కొం టున్నామని కూడా గుర్తించలేకపోయాము. ఎందుకంటే ఇలాంటి సమస్యలు కమ్యూనిటీలో సర్వసాధారణం. అమ్మాయిలు యుక్తవయసుకు వచ్చిన వెంటనే వివాహం చేసుకోవడం అనవాయితీగా భావిస్తారు. పాఠశాల, ఆర్థిక స్వాతంత్య్రం, ఉద్యోగాల వంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు’ అని కుమారి అంటుంది. అటువంటి జీవితాలు అనుభవిస్తున్న కుమారి లాంటి మహిళలు ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీ వద్ద శిక్షణ పొంది దేశవ్యాప్తంగా మహిళలు టెక్నాలజీ, ఇంజినీరింగ్‌లో ఎలా గొప్ప విజయాలు సాధిస్తున్నారో నిరూపిస్తున్నారు. ‘ఇక్కడ తీసుకున్న శిక్షణా పరిజ్ఞానం నేను కాలేజీని పూర్తి చేయబోతున్నానని నా కుటుంబాన్ని ఒప్పించటానికి నాకు సహాయపడింది’ అని ఆమె అంటోంది. ఇప్పుడు ఆమె సంస్థలో స్టైఫండ్‌తో పని చేస్తోంది. ఇంటికి డబ్బు తీసుకెళుతోంది. ఒక్క కుమారి మాత్రమే కాదు ఫెమినిస్ట్ అప్రోచ్ టు టెక్నాలజీని నడుపుతున్న పది మంది యువతుల బృందం వారి పరిసరాల్లోని అట్టడుగు సంఘం నాయకులుగా ఎదిగారు.
ప్రభావం-పెరుగుదల
మొదటి సారి ఢిల్లీలో బాలికలు ఈ రంగంలోకి ప్రవేశించకుండా నిరోధించే అడ్డంకులను విచ్ఛిన్నం చేయడం లక్ష్యంగా చిన్న వర్క్‌షాప్‌లతో సంస్థ తన పని ప్రారంభించింది. ఈ వర్క్‌షాప్‌లలో బాలికలు టాలీ, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్, గూగుల్ ట్రాన్స్‌లేట్, ఇమెయిల్ వంటి ప్రాథమిక విషయాలు నేర్చుకున్నారు. ఇది వారికి ఉద్యోగాలు వెదుక్కోవడంలో, సొంతంగా చిన్న సంస్థలు పెట్టుకోవడంలో సహాయపడింది. కాలక్రమేణా ఈ వర్క్‌షాప్‌లు బాలికలకు నిరంతర మద్దతు, మార్గదర్శకత్వం, సాంకేతిక నైపుణ్యాలను అందించే దీర్ఘకాలిక ప్రోగ్రామ్‌లుగా పరిణామం చెందాయి. సంస్థ పని ఢిల్లీ దాటి బీహార్, పూణే, జార్ఖండ్‌లకు కూడా విస్తరించింది. బాలికల కోసం టెక్ సెంటర్, నైపుణ్యం-నిర్మాణం, సృజనాత్మక వ్యక్తీకరణ, అన్వేషణకు కేంద్రంగా పనిచేస్తుంది.
అదనంగా ఎన్నో ప్రాజెక్టులు
ప్రస్తుతం సంస్థ అనేక డిజిటల్ అక్షరాస్యత ప్రచారాలకు నాయకత్వం వహిస్తుంది. ఇది సురక్షితమైన, సమ్మిళిత ఇంటర్నెట్ వినియోగంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీలలో కృషి చేస్తోంది. ఇంట్లో చిన్న చిన్న విద్యుత్ లోపాలను సరిచేయడం నుండి నీటి సంరక్షణపై ఉద్రిక్త నిర్మాణాలు, పాఠశాల ప్రాజెక్టులను నిర్మించడం వరకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. అలాగే డిజిటల్ భద్రత, డిజిటల్ గోప్యత, వేగంగా డిజిటలైజ్ అవుతున్న ప్రపంచంలో మహిళల పాత్ర గురించి అవగాహన పెంచడానికి ప్రచారాలను కూడా నిర్వహిస్తోంది.