మానవ అక్రమ రవాణా నిర్మూలిద్దాం

– మూలాల్లోకి వెళ్దాం :రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మానవ అక్రమ రవాణా నిరోధానికి ఆ నేరానికి మూలాల్లోకి వెళ్లి ప్రయత్నించాలని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సూచించారు. జాతీయ మహిళా కమిషన్‌, సీఐఎస్‌ఎఫ్‌ సంయుక్తాధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మానవ అక్రమ రవాణా నిరోధంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడి నుంచి అక్రమ రవాణా జరుగుతున్నది? రవాణా మార్గాలేంటి? ఎక్కడికి చేరుస్తున్నారు? అనే విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అణగారిన వర్గాల చిన్నారులు, మహిళలు, కార్మికులు, వలసజీవులు భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఈ సదస్సులో జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ, సభ్య కార్యదర్శి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.