– చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి రమణ
– సత్తెనపల్లి రామకృష్ణ 23వ వర్ధంతి
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ రంగం ప్రయిటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుదామని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి.రమణ పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యమంలో అమరుడైన సత్తెనపల్లి రామకృష్ణ 23వ వర్ధంతి సభ శుక్రవారం హైదరాబాద్ జమ్మిస్తాన్‌పూర్ రిసాలగడ్డలోని వృత్తిదారుల భవన్‌లో జరిగింది. సత్తెనపల్లి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2000లో విద్యుత్ సంస్కరణలకు, ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన చలో అసెంబ్లీ సందర్భంగా ఆనాటి ప్రభుత్వం బషీర్‌బాగ్ వద్ద ఆందోళనకారులపై పాశవికంగా వ్యవహరించిందని, విచక్షణారహితంగా జరిపిన లాఠీచార్జి, పోలీస్ కాల్పుల్లో రామకృష్ణతోపాటు మరో ఇద్దరు తుది శ్వాస విడిచారన్నారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఆ అమరుల త్యాగంతో రైతులకు, వృత్తిదారులకు ఉచిత విద్యుత్తు పథకాలు అందుతున్నాయని తెలిపారు. అయితే కేంద్రం తెచ్చే విద్యుత్ రంగం ప్రయివేటీకరణ బిల్లు మూలంగా సబ్సిడీలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకునేదాకా వృత్తిదారులంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ.. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో రాబోయే కాలంలో వృత్తిదారుల హక్కుల కోసం పోరాడాలని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృత్తిదారుల ఆర్థిక పథకానికి సుమారు 5 లక్షల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వారి అనుచరులైన బీఆర్‌ఎస్ కార్యకర్తలకే లక్ష రూపాయల పథకం అందిస్తున్నారని ఆరోపించారు. రజక వృత్తిదారులకు రక్షణ చట్టం చేయాలని, 50 ఏండ్లు పైబడిన వృత్తిదారులందరికీ పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి యం.బాలకృష్ణ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సి.మల్లేష్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జ్యోతి ఉపేందర, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి మిరియాల గోపాల్, సోషల్ మీడియా రాష్ట్ర కో-కన్వీనర్ రాపర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.