వెంట పడ్తాం.. వేటాడ్తాం..

Don't let KCR, who brought Telangana, turn around– తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా
– నన్ను చంపితే మీరు ఉంటరా..

– నా కట్టె కాలేవరకు తెలంగాణ కోసం పోరాడుతా..
– మళ్లీ డబుల్‌ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం..
– అసెంబ్లీ తీర్మానం సరే.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
– సంపూర్ణమైన నీటి వాటా వచ్చే వరకు కొట్లాడుతాం
– దమ్ముంటే మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయాలి
– అసెంబ్లీ అయ్యాక మేం కూడా సందర్శిస్తాం
– రాష్ట్రంలో దద్దమ్మల రాజ్యం
– ఇది రాజకీయ సభకాదు..ఉద్యమ సభ.. : మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ(నల్లగొండ)
కృష్ణా జలాల వాటా వచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వెంటపడి వేటాడ్తాం.. అది సాధించే వరకు నిద్రపోనియం.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరుగనివ్వరా.. నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పోరాడుతా.. అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కృష్ణాజలాల వాటా సాధన కోసం మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ వద్ద మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. కృష్ణాజలాల ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించడంపై అసెంబ్లీ తీర్మానం చేసిందని, దాంతో సరిపోదని, ఇక అసెంబ్లీ బంజేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కృష్ణా ట్రిబ్యునల్‌ ప్రకారం తెలంగాణకు రావాల్సిన జలాల వాటా వచ్చే వరకు ప్రధానిపై, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.మ కృష్ణాజలాల వాటా దక్కే విధంగా పోరాడాలన్నారు. కృష్ణాజలాల వాటా కోసం 24ఏండ్లుగా పోరాడుతున్నానని, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పటికీ కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖలు రాస్తునే ఉన్నామని చెప్పారు. తన హయాంలో కేంద్రం నుంచి అనేక బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా తట్టుకున్నాం.. కానీ కృష్ణాజలాలు అప్పగించలేదన్నారు. చివరకు మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదన్నారు. సంపూర్ణమైన నీటి వాటా వచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటానన్నారు.
కాళేశ్వరం ఒక ఆట బొమ్మ కాదన్నారు. మేడిగడ్డలో ఏముందని, కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు అని అందులో 250 పిల్లర్లు ఉన్నాయని, 1200 కిలోమీటర్లు కాల్వ ఉందని, 19సబ్‌స్టేషన్లు ఉన్నాయని, 20 రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పారు. అన్ని ఉన్నప్పుడు అందులో రెండు మూడు కుంగడం సహజమని, దానిని సరిచేసి నీల్లు ఇవ్వడం వదిలేసి ఏదో తప్పు జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారని అన్నారు.
గతంలో నాగార్జున్‌సాగర్‌, ఎస్సారెస్పీ, మూసీ ప్రాజెక్టులు కుంగిపోలేదా అని ప్రశ్నించారు. మేము కూడా అసెంబ్లీ అయ్యాక మేడిగడ్డను సందర్శిస్తామన్నారు. అహంకారంతో, దుర్మార్గంతో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. ”మీరు అంత మగాళ్లా.. నన్ను చంపి మీరు ఉంటరా.. మీకు అంత దమ్ముందా..రా” అంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను హెచ్చరించారు. చేతగాక.. పాలన చేయలేక పొద్దుల్నేస్తే కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రంలో దద్దమ్మల రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు. ”మేడిగడ్డ బొందల గడ్డకాదు.. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి.. మీకు దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయండి” అని కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. నీళ్ల విషయంలో వారికి అవగాహన లేదన్నారు. తెలివిలేకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని, ప్రతిపక్షంలో తనతోపాటు ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఉన్నారని, కనీసం వారినైనా అడిగి తెలుసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామం ప్రాజెక్టు, గురుకుల పాఠశాలల పెరుగుదల, కరెంట్‌, మంచినీళ్ల విషయంపై దృష్టిపెట్టి పూర్తి చేయాలన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు 24గంటలు కరెంట్‌, ఇంటింటికీ మంచినీరు అందించామన్నారు. రైతులకు కరెంట్‌, నీళ్లు పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువుల పంపిణీ, పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేశామని వివరించారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి కరెంట్‌ బంద్‌ అయ్యిందని, రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో జనరేటర్‌ పెట్టి నడిపించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ మధ్యనే మరో విషయం తెలిసిందని.. ధాన్యానికి మద్దతు ధర వస్తే బోనస్‌ రూ.500 ఇవ్వబోమని కాంగ్రెస్‌ చెబుతుందని ఇదేక్కడి దారుణమని అన్నారు. నాడు..నేడు ఎప్పుడూ తెలంగాణ హక్కుల సాధన కోసం కేసీఆర్‌ పోరాటాలు చేస్తూనే ఉంటాడని, కట్టె కాలేవరకు తెలంగాణ కోసం పోరాడుతానని చెప్పారు. కృష్ణా జలాల హక్కుల సాధన కోసం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ప్రజలు పోరాడాలని, ఇది ఈ జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్యని చెప్పారు. నల్లగొండ సభ కేవలం శ్రీకారమేనని, భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు ఉంటాయని, ఒక్క పిలుపుతోనే తెలంగాణ ప్రజలు తరలివచ్చి సైనికులుగా ఉద్యమించాలని సూచించారు. ఈ సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వర్‌రావు, బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, సబితాఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌, గంగుల కమలాకర్‌, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.