– శాట్స్ క్రీడా యువ సమ్మేళనాలు
– 33 జిల్లా కేంద్రాల్లో క్రీడా చైతన్య కార్యక్రమాలు
– జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహణ
నవతెలంగాణ-హైదరాబాద్
సీఎం కప్ విజయోత్సాహంలో సమగ్ర కెసిఆర్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర క్రీడా ప్రాధికారం సంస్థ (శాట్స్).. మరో భారీ కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో మైదాన్’ కార్యక్రమం నిర్వహించనుంది. తెలంగాణ యువతరంలో క్రీడల పట్ల అవగాహన, క్రీడా రంగాన్ని ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణ కల్పించటమే ప్రధాన లక్ష్యంగా చలో మైదాన్‌ను రూపకల్పన చేశారు. ఆగస్టు 29న 33 జిల్లా కేంద్రాల్లో చలో మైదాన్ పేరిటి క్రీడా యువ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరిగే ప్రధాన కార్యక్రమానికి క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరు కానుండగా.. జిల్లా కేంద్రాల్లో మంత్రులు పాల్గొంటారు.
ఆటలతో ఆరోగ్యం : ఆటలతో ఆరోగ్యం, ఆనందం, అభివృద్ది నినాదంతో చలో మైదాన్‌కు వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల క్రీడా ప్రాంగణాలు, 75 నియోజకవర్గ స్టేడియాలు సహా 33 జిల్లా కేంద్రాల్లో క్రీడా మైదానాల్లో యువ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. 15-36 ఏండ్ల వయసు కలిగిన యువతను లక్ష్యంగా అవగాహన శిబిరాలు చేపట్టనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణ ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కల్పించనున్నారు.
విజేతల గాథలతో.. : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే క్రీడా యువ సమ్మేళనాల్లో యువ కళాకారులతో క్రీడా సంబంధిత సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది పాలనలో క్రీడా రంగం సాధించిన విజయాలు, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలు సహా మన రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత విజయాలు సాధించిన క్రీడాకారుల విజయ గాథలను డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించను న్నారు. ఇందుకోసం శాట్స్ యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తుంది.