– ఆర్థిక శాఖ అధికారులతో కేసీఆర్ సమాలోచన
– 14 శాతంలోపు ప్రకటించే అవకాశం
– నేడో, రేపో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం
– పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు సీఎం అంగీకారం
– ఈహెచ్‌ఎస్ అమలుకు సానుకూలత
– సీపీఎస్‌ను రద్దు చేయాలి :ముఖ్యమంత్రికి ఉద్యోగ జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లకు వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలుకు సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఐఆర్ ఎంత ప్రకటిస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఐఆర్ ఎంత ప్రకటించాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఐఆర్ ఎంత ఇస్తే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందన్న సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ తొలి పీఆర్సీలో ఐఆర్ లేకుండానే నేరుగా 30 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం ప్రకటించారు. కానీ ఈసారి ఐఆర్‌ను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఐఆర్ ఎంతివ్వాలన్నది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. ఇంకోవైపు ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్‌కు ఇప్పుడు నెలకు రూ.నాలుగు వేల కోట్లు ఖర్చవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాబడి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అయ్యే ఖర్చును కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన బీసీలకు రూ.లక్ష, మైనార్టీలకు రూ.లక్ష సాయంతోపాటు రైతు రుణమాఫీకి రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ఐఆర్ ఎంతివ్వాలనే దానిపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సంప్రదింపులు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని సీఎం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 14 శాతంలోపు ఐఆర్ ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శాతం ఐఆర్ ఇస్తే రూ.30 కోట్లు ప్రభుత్వం అదనంగా భరించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.360 కోట్లవుతాయి. ఈ లెక్కన ఐదు శాతానికి నెలకు రూ.150 కోట్లు, ఏడాదికి రూ.1,800 కోట్లు, ఎనిమిది శాతానికి నెలకు రూ.240 కోట్లు, ఏడాదికి రూ.2,880 కోట్లు, పది శాతానికి నెలకు రూ.300 కోట్లు, ఏడాదికి రూ.3,600 కోట్లు, 12 శాతానికి నెలకు రూ.360 కోట్లు, ఏడాదికి రూ.4,320 కోట్లు, 14 శాతానికి నెలకు రూ.420 కోట్లు, ఏడాదికి రూ.5,040 కోట్లు ఖర్చవుతాయి. అయితే తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు జూన్ 30తో ముగిసింది. రెండో పీఆర్సీ ప్రకారం గతనెల ఒకటో తేదీ నుంచి కొత్త వేతనాలను ఉద్యోగులు తీసుకోవాలి. కానీ పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించలేదు. అయితే కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించినట్టు సమాచారం. అందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. శుక్ర లేదా శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యే అవకాశమున్నది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ కార్యక్రమాలు, దళితబంధు, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష సాయం, ఇప్పుడు రుణమాఫీకి నిధులు ఎక్కడి తేవాలన్న చర్చ జరుగుతున్నది. అయినా సీఎం ఐఆర్ ప్రకటిస్తే ఆ నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.
జులై నుంచే ఐఆర్ అమలు చేయాలి :ఉద్యోగ జేఏసీ
రెండో పీఆర్సీని గతనెల ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఐఆర్ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ కోరింది. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఉద్యోగ జేఏసీ చైర్మెన్ ఎం రాజేందర్, సెక్రెటరీ జనరల్ వి మమత నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేసి వారికి మెరుగైన వైద్య సేవలను అందేలా ఈహెచ్‌ఎస్‌ను ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీపీఎస్‌ను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 36,37లో గతంలో ఉద్యోగులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని భాగ్యనగర్ ఎన్జీవో హౌజింగ్ సొసైటీకి అప్పగిస్తూ ఉత్తర్వులివ్వాలని సూచించారు. ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారం చేస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, బీటీఎన్జీవో అధ్యక్షులు సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. –