మణిపూర్‌ అంశంపై మోడీని కలుస్తాం

యూఎస్‌ పర్యటనకు ముందే ఆయనతో సమావేశాన్ని కోరిన
పది మంది ప్రతిపక్ష నేతలు
ప్రధాన మంత్రి కార్యాలయానికి మెమోరాండం అందజేత
న్యూఢిల్లీ : మణిపూర్‌ అంశంపై ప్రధాని మోడీతో సమావేశం కావటానికి భావసారుప్యత కలిగిన పది మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. మోడీ యూస్‌ఏ పర్యటనకు ముందే ఆయనతో తక్షణ సమావేశానికి వారు కోరారు. వీరిలో ఒక మాజీ సీఎం, ఇద్దరు మాజీ స్పీకర్లు ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 20న మోడీ యూఎస్‌కు పయనం కానున్న విషయం విదితమే. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఈ మణిపూర్‌ ప్రతినిధి బృందంలో మణిపూర్‌ మాజీ సీఎం ఇబోబి సింగ్‌తో పాటు జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన, ఆప్‌, ఆర్‌ఎస్పీలకు చెందిన తొమ్మిది మంది నాయకులు ఉన్నారు. మోడీతో సమావేశంపై వారు ఈనెల 10న ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరినట్టు చెప్పారు. ప్రధాని మోడీ తమ మాట వింటారన్న ఆశతో అప్పటి నుంచి ఢిల్లీలో ఉంటున్నట్టు వారు తెలిపారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరటంతో పాటు మణిపూర్‌లో నెలకొన్న జాతి హింస, మయన్మార్‌ విషయంలో భారత విదేశాంగ విధానాన్ని సవరించాల్సిన అవసరంపై కూడా వారు ఒక మెమోరాండంను అందించారు. ”మణిపూర్‌ 40 రోజులకు పైగా మండిపోతున్నది. డజన్లకొద్ది మంది చనిపోయారు. సహాయ శిబిరాల్లో 20 వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు. ఈ రోజు వరకు కూడా ప్రధాని ఒక్క పదమూ చెప్పలేదు. మణిపూర్‌లో భారత్‌లో భాగమేనా? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఒకవేళ భారత్‌లో భాగమే అయితే ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మణిపూర్‌లో మేము శాంతిని కోరుతున్నాం. సాధ్యమైనంత త్వరగా దీనిని పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. అందుకే ఆయన(ప్రధాని) ప్రతినిధి బృందంతో కలుస్తారని మేము ఆశిస్తున్నాం” అని కాంగ్రెస్‌ మాజీ సీఎం ఇబోబి సింగ్‌ అన్నారు.