– అన్నదాతలే మన ఆయువు పట్టు
– వాతావరణ మార్పులపై అత్యవసర దృష్టి :
– స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు
న్యూఢిల్లీ: కల్లోలిత సమయా ల్లో కూడా భారత్, ప్రతికూల పరిస్థితులను ధృఢంగా ఎదుర్కొన గలిగి ముందుకు సాగిందని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ సమర్ధవంతంగా నిలబడగలిగింద ని, అంతేకాకుండా ఇతరులకు ఆశా కిరణంగా కూడా నిలిచిందని అన్నా రు. దేశ 75వ స్వాతంత్య దినోత్స వాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలియచేశారు. అనేక రంగాల్లో దేశం ముందుకెళుతోందని అన్నారు. తనకు ఎదురైన సవాళ్ళను అవకాశా లుగా మలుచుకుని అప్రతిహతంగా ముందుకు సాగుతోందన్నారు. రికార్డు స్థాయిలో అధిక జిడిపి వృద్ధిరేటును సాధించిందన్నారు. జి-20 దేశాల్లో భారతదేశ పాత్రను అమె ఈ సందర్భంగా ఉటంకించారు. విద్యా, శాస్త్ర రంగాల్లో ముందంజ వేస్తున్నామని అన్నారు. జాతీయ విద్యా విధానం, 2020ని, చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగించ డంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ఆమె కొనియాడారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా ఆమె కోరారు. ఇందుకోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కృషి జరగడం చాలా అవసరమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ పౌరులమని, మన రాజ్యాంగ విధులను, బాధ్యతలను నెరవేర్చడానికి మనందరం ప్రతిన చేయాలని, వ్యక్తిగత, సామూహిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాల్లో అద్భుతమైన పని తీరు దిశగా ముందుకు సాగేందుకు నిరంతరంగా కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. నిరంతరంగా పురోగమిస్తూనే అద్భుతమైన విజయాల సాధనతో సర్వోన్నత శిఖరాలను అధిష్టించవ్చని అన్నారు. మన రాజ్యాంగమే మనకు మార్గదర్శి పత్రమని వ్యాఖ్యానించారు. మన జాతి నిర్మాతలు కన్న కలలను సాకారం చేసేందుకు సామరస్యత, సోదర భావంతో కలిసిమెలిసి మనందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై అత్యవసరంగా శాస్త్రవేత్తలు, విధానకర్తలు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పర్యావరణ ప్రయోజనాల కోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కృషి జరగడం చాలా అవసరమని అన్నారు.
ఆదివాసీలు తమ ఆచార సాంప్రదాయాలను మరింత పరిపుష్టం చేసుకుంటూనే మరోవైపు ఆధునిక భావజాలాన్ని అలవరుచుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు. సమాజంలో వెనక్కి నెట్టబడిన వారికి ప్రాధాన్యత నివ్వడమనేది మనం అనుసరించే విధానాల ఏకైక మూల సూత్రమని అన్నారు. ఫలితంగానే గత దశాబ్ద కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు దారిద్య్రం నుండి బయటపడ్డారని అన్నారు.
మన అన్నదాతలకు ఈ దేశం రుణపడి వుందన్నారు. ముందుకు సాగే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను, అవరోధాలను అధిగమిస్తూ వారు మన దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి లక్ష్యాలను, మానవతా సహకారాన్ని మరింత పెంపొందిం చడంలో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. అంతర్జాతీయ వేదిక లపై కూడా తన సత్తా చాటుతోందన్నారు. మొత్తంగా ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జి 20దేశాల్లోనే వున్నారని, అంతర్జాతీయ ప్రాధా న్యతలను, సరైన దిశలో పెట్టగలిగేందుకు ఇదొక విశిష్టమైన అవకాశమని, భారత్ దాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని అన్నారు. భారత పౌరులుగా మన గుర్తింపు అన్నింటికీ మించిందని ఆమె వ్యాఖ్యానించారు.