అభ్యర్థులకు భరోసానిద్దాం

– మరింత పకడ్బందీగా పరీక్షలను నిర్వహిద్దాం
– టీఎస్‌పీఎస్సీపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం
– సీఎంతో చైర్మెన్‌ జనార్థన్‌ రెడ్డి భేటీ
– హాజరైన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సీఎస్‌ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం హాట్‌హాట్‌గా మారిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ శనివారం అత్యవసరంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రం అట్టుడుకుతున్నది. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నుంచి నిరుద్యోగులకు న్యాయం చేయడంతో పాటు లీకేజీ బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ బలంగా వినపడుతున్నది. నిందితుల్లో బీజేపీ క్రియాశీలక కార్యకర్త ఉండటంతో ఆ పార్టీ ప్రమేయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల నుంచి అనుమానం వ్యక్తమవుతున్నది. టీఎస్‌పీఎస్సీ రద్దు చేయాలనీ, మంత్రులు రాజీనామా చేయాలనే రకరకాల డిమాండ్లను ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముందుకు తెచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్‌ నిర్వహించిన సమావేశా నికి టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ జనార్థన్‌రెడ్డి హాజరయ్యారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మెన్‌ ఘంటా చక్రపాణి కూడా పాల్గొన్నారు. లీకేజీకి దారి తీసిన పరిస్థితులు, అందులో రాజకీయ, సాంకేతిక, ప్రభుత్వ అధికారుల ప్రమేయంపై సీఎం ఆరా తీశారు. అభ్యర్థులకు భరోసానిచ్చేలా పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయిం చారు. లీకేజీకి ఏ మాత్రం అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిం చారు. విమర్శలకు తావు లేకుండా తదుపరి కార్యా చరణ ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు.