– ఉపాధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు
– గీత కార్మిక సంఘం 66 ఏండ్ల ప్రస్థానంలో త్యాగాలెన్నో..
– కేజీకేఎస్ ఉత్సవాల్లో పలువురు వక్తలు
– ఆటపాటలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
– ఆకట్టుకున్న సర్వాయి పాపన్న చిత్ర ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీత వృత్తిదారుల బతుకు బాధలన్నింటిని ఒడిసిపట్టి, పోరాట నినాదాలకు రూపమిచ్చిన సంఘం కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్). పాలకుల నిర్లక్ష్యం, పెత్తందార్ల దాష్టీకంపై అది అలుపెరగని పోరాటాలు చేసింది. కార్మికుల కష్టాలు, వృత్తి రక్షణ కోసం రాజీలేని రణం నడిపింది. ఎన్నో త్యాగాలు చేసింది. ఈ క్రమంలో అమరులైన వారెందరో..వారందరికీ వందనాలంటూ సభికులు నినాదాలు చేశారు. కల్లుగీత కార్మిక సంఘానికి 66ఏండ్లు నిండిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీకేఎస్ ఆధ్వర్యంలో సాంస్కృతికోత్సవాలను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు అలారుబలారు తీసుకున్నారు. గీత వృత్తి రక్షణకోసం ఉద్యమిస్తామంటూ నినాదాలు చేశారు. మోకు, ముస్తాదుతో వచ్చిన కొందరు కార్మికులు వృత్తి కష్టాలను వెళ్లబోసుకున్నారు. కళాకారులు ఆటపాటలతో అదరగొట్టారు. గీత వృత్తిలో కార్మికుడి వెతల్ని కైకట్టి పాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తులు, స్వచ్ఛమైన కల్లు, సేఫ్టీ మోకు, ఆకర్షణీయంగా నిలిచాయి. గీత వృత్తికోసం పాటుపడిన పెద్దలనూ, వివిధ సంఘాల నేతలను సభలో సత్కరిం చారు. ‘అమరులను యాది చేసుకుందాం.. హక్కులను సాధించుకుందాం’మంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత పోరాట చరిత్రను వివరించే చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చిత్రకారుడు భాస్కర్ కుంచెతో రూపుదిద్దిన ఈ ఎగ్జిబిషన్ సభికులను విశేషంగా ఆకట్టుకున్నది.సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ అధ్యక్షతన ఈ సభ జరిగింది. పలువురు వక్తలు మాట్లాడారు. కేజీకేఎస్ పోరాటాలను మననం చేసుకున్నారు. సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 1957 అక్టోబర్ 19,20 తేదీల్లో తమ సంఘం మొదటి రాష్ట్ర మహాసభ మహబూబాబాద్ జిల్లా గార్లలో జరిగిందని తెలిపారు. బొమ్మగాని ధర్మబిక్షం, ఎస్‌ఆర్ దాట్ల నాయకత్వంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అది ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందన్నారు. అనేక హక్కులు సాధించిందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయ పార్టీల కతీతంగా గీత కార్మికులను సమీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ నాడు సంఘం నాయకులు వేలం పాటల విధానానికి వ్యతిరేకంగా పోరాడి సొసైటీలను ఏర్పాటుకు ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. మహిఫూజ్ చట్టాన్ని రద్దు చేయించి, చెట్టుపై హక్కు గీత కార్మికులకే కల్పించారన్నారు. వారి త్యాగం మరువలేనిదన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు పాట ఆయుధంగా పనిచేస్తుందన్నారు. కళల ద్వారా ప్రజా చైతన్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆయిలి వెంకన్న గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్, సుప్రజ హాస్పిటల్ ఎండి శిగ విజరు కుమార్ గౌడ్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు యం. కృష్ణ స్వామి గౌడ్, బోయపల్లి సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు గౌనీ వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, ఎస్ రమేష్ గౌడ్, గాలి అంజయ్య, పామను గుల్ల అచ్చాలు రాష్ట్ర కమిటీ సభ్యులు మడ్డి అంజిబాబు, రాగిరి కృష్ణయ్య, అబ్బ గాని బిక్షం ,అంతటి అశోక్ కొండ వెంకన్న, రాచకొండ వెంకట్ గౌడ్, కుర్ర ఉప్పలయ్య, కంకటి రాజన్న,యమగని ఎంకన్న తండా రాముడు డొంకెల రామన్న ,బబ్బూరి ఉప్పలయ్య, గౌని సాంబయ్య ,మెరుగు వీరస్వామి, తాళ్లపల్లి నరసయ్య, నడిమింటి ఆశన్న గౌడ్, గడ్డమీద జంగన్న గౌడ్, అంబాల శ్రీనివాస్ గౌడ్, భీమ గాని చంద్రయ్య, మాటూరి బాలరాజు గౌడ్, గుణగంటి మోహన్ బుర్ర శ్రీనివాస్, బండి కుమార్, కప్పల లింగం, సట్ల ప్రభాకర్ ,కొండ అన్నపూర్ణ, ఎం స్వర్ణ, బొడ పట్ల జయమ్మ ,తదితరులు పాల్గొన్నారు.