టీచర్‌ – పిల్లలు కలసి చదువుకుందాం

టీచర్‌ - పిల్లలు కలసి చదువుకుందాంఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతోంది గద్ద. అంత ఎత్తునుండి కూడా కోడిపిల్లను చూసి రివ్వున ఎత్తుకుపోగలదు. దాని చూపు, వేగం, తీక్షణ శక్తి అది. గద్ద ఎంత ఎత్తు ఎగిరినా గూడు కట్టి, గుడ్లు పెట్టేది చెట్టుకొమ్మల్లోనే కదా.
అలా ఓ గద్ద ఓ చెట్టుపై గూడు కట్టుకుని గుడ్లు పెట్టింది. అందులోనుంచి ఓ గుడ్డు జారి చెట్టుకింద గడ్డిలో వున్న కోడిగుడ్ల మధ్య పడింది. తల్లి కోడి యథాప్రకారం తన గుడ్లతో పాటు ఈ గుడ్డునూ పొదిగింది. కొన్నాళ్లకు గుడ్లు అన్నీ పిల్లలైనాయి.
కోడి వెంట కోడిపిల్లలు తిరుగుతూ వుండేవి. వాటితో పాటు గద్ద పిల్ల కూడా. తిరుగుతూ తిరుగుతూ అలా అలా పెద్దవి అవుతూ వుండేవి. పెద్దవి అవుతున్న కొద్దీ వాటి శక్తిసామర్ద్యాలు కూడా పెరుగుతూ వుండేవి.
గద్ద పిల్ల స్వభావరీత్యా మిగిలిన పిల్లల కంటే పైకి ఎగరాలని అనుకునేది. ఆకాశంలో పైన ఎగురుతున్న గద్దలను చూసి, తాను కూడా ఎప్పటికైనా అంత ఎత్తుకు ఎగురుతాననని చెప్పేది. అది విని తక్కిన కోడిపిల్లలు నవ్వుకునేవి.
‘ఆశకు కూడా అంతుండాలి. ఇంటికప్పు పైకి ఎగరాలంటేనే తలప్రాణం తోకకొస్తుంది. ఆకాశంలోకి ఎగరాలంటే మాటలా? నోరు మూసుకుని పడివుండు’ అని తల్లికోడి మందలించేది.
అవును కదా! అని తన ప్రయత్నాలు మానుకునేది గద్దపిల్ల. ఇక ఎప్పటికీ ఎగరలేను అనుకుని, ఆశను చంపుకుని, అలా అలా దిగులుతో త్వరగా ముసలిదై చనిపోయింది.
ఇదో జానపద కథ. కథ చెప్పిన తర్వాత పిల్లల స్పందన కనుక్కోవాలి.
గద్దపిల్లది సహజమైన ఆశా? దురాశా?
గద్దపిల్ల తన ప్రయత్నాలు మానుకోవడం సరైనదా? కాదా? తన భవిష్యత్‌ దెబ్బతినడానికి ముఖ్యకారణం తనదా? ఇతరులదా? చెప్పుడు (రకరకాల) మాటలు విని ప్రయత్నాలు మానుకోవాలా? కొనసాగించాలా?
ఇలా ఎంతో చర్చను పిల్లల్లో రేకెత్తించవచ్చు. ఎవరు ఎంత చెప్పినా, పరిస్థితులు అనుకూలించక పోయినా సహజమైన శక్తిని, ఆత్మ స్థైర్యాన్ని కోల్పోరాదని, కోల్పోతే భవిష్యత్తే దెబ్బతింటుందని, జీవితమే వుండదనే సత్యాన్ని గ్రహించాలి. చదువుకు దూరమయ్యే ఆదివాసి పిల్లల పరిస్థితికి ఈ కథ అద్దం పడుతుంది.
ఇలా అనుభవ సత్యాలను గోరుముద్దలుగా చేసి పిల్లలకు చెప్పే టీచర్లు బహు అరుదుగా వుంటారు. వారికి వృత్తి – ప్రవృత్తి జీవితంలో వేర్వేరుగా వుండవు. పిల్లలే లోకంగా బతుకుతారు. అటువంటివారిలో ముందు వరుసలో నిలుస్తారు సమ్మెట ఉమాదేవి. తమ టీచర్‌ అనుభవాలను ‘మా పిల్లల ముచ్చట్లు’గా మనకు అందించారు.
ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏళ్లతరబడి పనిచేసిన అనుభవమంతా రంగరించి కుప్పగా పోశారు. ”ఒకే కాలంలో వివిధ ప్రాంతాల్లో బతుకుతున్న పిల్లల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో, వారి విద్యాసామర్థ్యాల్లో, సౌకర్యాల్లో, వారి భాషలో, భావ వ్యక్తీకరణలో ఎన్నో సారూప్యతలు, ఎన్నెన్నో వైవిద్యాలు వుంటాయి. మొత్తం వుంటుంది నా గమనంలో. గమనింపుకు వచ్చి నన్ను సంతోషపెట్టిన విషయాలు, కంట తడిపెట్టించిన విషయాలు, నేను గర్వపడ్డ క్షణాలు అన్నీ పొందుపరిచాను” అని ఆమె తెలిపారు. అంటే పిల్లల్లో ఎంతగా మమేకం అయ్యారో అర్ధమవుతుంది.
రండి! మా పల్లెబడిలో విహరిద్దాం! అని స్వాగతిస్తూ, ‘ఉద్యోగ విరమణానంతర యానం’ వరకూ మొత్తం 220 ఘటనలను గుదిగుచ్చి గ్రంథం చేశారు. చదువుతున్నప్పుడు పిల్లలకే కాదు పెద్దలకూ తమ అనుభవ జ్ఞాపకాలు తారట్లాడతాయి. నునువెచ్చగా స్పర్శిస్తూ, సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. అందుకే టీచర్‌ – పిల్లలు కలిసి చదవ వలసిన పుస్తకం ఇది.
‘ఎండాకాలం వెళ్లి తొలకరి కురిసే వేళల్లో బడులు మొదలవుతాయి. రైతులంతా దుక్కిదున్ని వాన కోసం ఎదురుచూస్తుంటారు. కాని వానరాక ఎప్పుడో తెలియదాయె. ఒక్క వానపడితే పత్తి విత్తుకోవడం కోసం మా పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు కూడా. మిరపనారు తెచ్చుకుని తోట వేసేవేళ యూనిఫామ్‌లు వేసుకుని మరీ పంట చేలల్లో కనిపించేది మా బడిపిల్లలే’ అంటూ కించెత్‌ గర్వం ఒలకబోస్తారు. చదువు – జీవితం వేర్వేరు కాదని నర్మగర్భంగా తెలుపుతారు. అంతేనా వానకోసం వారు చేసే కప్పలపెళ్లి పండుగను ‘మిటెక్‌ మాటెక్‌’ అంటారని, ఆ గిరిజన సంస్కృతిని పాఠకులకు ఎరుక పరుస్తారు. మచ్చుకు ఇదో ఉదాహరణ (మిటెక్‌ – మాటెక్‌ – 33) మాత్రమే.
పిల్లల్లో టీచర్‌ చేసే ఈ పునాది కృషి వారి భావి జీవితాలకు పూలబాటలు నిర్మిస్తాయని వేరుగా చెప్పక్కర్లేదు కదా. అందుకే ‘ఇవాల్టి సమాజంలో సాహిత్య కళారంగాల్లో, అధికారగణంలో రాజకీయ ప్రముఖులైన ఎందరికో వారి బాల్యంలో స్ఫూర్తిని, మార్గదర్శనాన్ని కలిగించిన వారి వ్యక్తిత్వ నిర్మాణంలో హేతువులుగా, సేతువులుగా అయినవారు గురువులే’ అని ‘అమ్మ ఒడి తొలిబడి’ అంటూ ప్రచురణకర్త వరప్రసాద్‌ తొలిమాటల్లో వక్కాణిస్తారు. ఈ జాతికిప్పుడు కావాల్సింది ఉత్తమ ఉపాధ్యాయులు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నదీ పుస్తకం అని విశదపరుస్తారు.
ఉపాధ్యాయులకు ఈ పుస్తకం పాఠ్యగ్రంధంలా ఉపకరిస్తుందని వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొంటే, గుడుల కన్నా బడులే ఎక్కువ వుండాలన్న అంబేద్కర్‌ మాటలను ఈ పుస్తకం బలపరుస్తున్నదని ఏనుగు నర్సింహారెడ్డి అంటారు.
గిజాబారు, బదేక రచనల వలే చదవవలసిన పుస్తకమిది అని వి.వి.లక్ష్మీనారాయణ అభివర్ణిస్తే, ఉపాధ్యాయులందరికీ చేరాల్సిన కరదీపిక అని దేవినేని మధుసూదన రావు తెలియజేస్తారు.
ఇలా ఎందరో ప్రముఖులు పుస్తకం గురించి బహుముఖంగా తెలిపినా, రచయిత ఉమాదేవి చెప్పిన మాటలు ఎంతో అమూల్యమైనవి.
‘సాయంత్రం బడి ముగిశాక ఇంటర్‌ సిటీ ట్రైన్‌లో వెళ్తున్న నాకు తటాకంలో కలువలు గాలికి ఊగుతున్నట్లు చిరునవ్వులతో, కేరింతలతో కేలుపుతూ ప్రతి సాయంత్రం ఇలా మా పిల్లలు పలికిన వీడ్కోలు నాకు నోబుల్‌ బహుమతి కన్నా మిన్న’.
అనుభవాలు అక్షరమాలగా మారడం అంటే ఇదేగా మరి!
కె.శాంతారావు, 9959745723