తిరగబడదాం… తరిమికొడదాం

– బీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై కాంగ్రెస్‌ నినాదాస్త్రం
– బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ప్రజాచార్జిషీట్‌
– నెల రోజుల ప్రచార కార్యాచరణ
– ప్రచార పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌ పార్టీ లాంఛనంగా ప్రజాకోర్టును ప్రారంభించింది. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి, దోపిడీ, ప్రజలకు చేసిన మోసం తదితర కీలకాంశాలపై ప్రజాకోర్టులో విచారణ చేపట్టింది. దళితులు, బీసీలు, గిరిజనులు, మైనార్టీలకు సర్కారు ఇచ్చిన హామీలు…అమలు చేయని వైనాన్ని ప్రజా కోర్టులో అభియోగాలు నమోదు చేసింది. ఇదే తరహాలో గ్రామాల్లోనూ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో గాంధీ నాలెడ్జి సెంటర్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ నిర్వహించిన ప్రజా కోర్టుకు ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య జడ్జిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి మజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. అంతకు ముందుకు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కాంగ్రెస్‌ పార్టీ పూరించింది. ‘తిరగబడదాం…తరిమికొడదాం’ అనే నినాదాస్త్రాంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చింది. తోడు దొంగలు బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ‘ప్రజాచార్జిషీట్‌’ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దర్‌, సియాసత్‌ ఎడిటర్‌ జహీర్‌అలీఖాన్‌కు సంతాపం తెలియజేసింది. ‘తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం అమోదం పొందే సందర్భంలో సోనియాగాంధీ, అప్పటి కేంద్రహోంమంత్రి పి. చిదంబరం, స్పీకర్‌ మీరాకుమార్‌ వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసి ప్రజలకు మరోసారి గుర్తు చేసింది. అదే క్రమంలో బీఆర్‌ఎస్‌ పాలనలో అప్పులపాలై ఆగమై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు పడుతున్న హృదయ విదారకమైన ఆవేదనల వీడియోను విడుదల చేసింది’. వీటన్నింటిని ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, నాయకుడు రాష్ట్రంలోని 72లక్షల కుటుంబాలకు వద్ద తీసుకెళ్లాలని కోరింది. ఇంటింటి ప్రచారం సందర్భంగా పోస్టుకార్డుపై సర్కారుపై వెల్లువెత్తిన అభియోగాలను నమోదు చార్జిషీట్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రజా యుద్ధానికి సిద్ధమైతే మిస్డ్‌కాల్‌ 7661899899 ద్వారా నమోదు చేయవచ్చనని తెలిపింది. తద్వారా లక్షలాది కుటుంబాల గుండెను తట్టాలని సూచించింది. 12వేల గ్రామపంచాయతీల్లో సభలు, మూడువేల డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నది. గ్రామాలు, తండాలు, గూడాల్లో నెలరోజులపాటు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అందుకు కార్యాచరణను ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్కతోపాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యనిర్వాహణ అధ్యక్షులు, ఏఐసీసీ జాతీయ కార్యదర్శులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజల శత్రువు అని చెప్పారు. వారిని పొలిమేర దాటించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ చేపట్టే ప్రజాకోర్టుల ద్వారా బీఆర్‌ఎస్‌ దోపిడీ, అక్రమాలను బహిర్గతం చేయాలని కోరారు. భట్టి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం లేకుండా బీఆర్‌ఎస్‌ అడ్డగోడగా నిలబడిందని విమర్శించారు. దాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం చేపట్టిన ప్రజాకోర్టు బోనులో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కటౌట్లు పెట్టి విచారణ చేపట్టారు. బడుగుల సమస్యలపై మహేష్‌కుమార్‌గౌడ్‌ తన వాదన వినిపించారు. దళితుల సమస్యపై మల్లురవి, ముస్లింలపై షబ్బీర్‌అలీ, బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతిపై చల్లా వంశీచంద్‌రెడ్డి, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి వైనంపై మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, చట్ట సభల పనితీరుపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాకోర్టులో వివరించారు. గిరిజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మాజీ ఎంపీ బలరాంనాయక్‌ ఏకరువు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర అనే అంశంపై అజహరుద్దీన్‌ను వివరించారు.