ఉచిత కరెంటు వద్దన్న ములుగు ఎమ్మెల్యేకు ఓటు వేద్దామా ?

– ప్రతిపక్షాల హామీలకు గ్యారెంటీ ఎవరు
– ప్రజలే తెల్చుకోవాలి : రెడ్కో చైర్మన్‌ ఏరువ సతీష్‌ రెడ్డి
నవతెలంగాణ- ములుగు
రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌ పార్టీ ములుగు ఎమ్మెల్యేకు ఓటు వేయద్దని, మూడు గంటలే కరెంటు చాలు అన్న కాంగ్రెస్‌ పార్టీని బొంద పెట్టాలని టీఎస్‌ రెడ్‌ కో చైర్మన్‌, ములుగు మండల ఎన్నికల ఇంచార్జ్‌ ఏరువ సతీష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ములుగు లోతట్ట గ్రామాల ప్రచారంలో భాగంగా సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయొద్దని రైతుబంధు ఇవ్వొద్దని ఎలక్షన్‌ కమిషన్‌కు ఒకవైపు ఫిర్యాదు చేస్తూ మరొకవైపు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని రైతుబంధు ఇవ్వడంలేదని ప్రజలకు చెప్తున్నారని కాంగ్రెస్‌ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపుని చ్చారు. గ్యారంటీల పేరుతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని మేనిఫెస్టోలో పొందుపరిచిన గ్యారెంటీలకు గ్యారెంటీ ఇచ్చే కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ఆది వారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసిందేవ్పేటలో ఆయన మాట్లాడారు. వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తోనే ములుగు ప్రజలు ఉంటేనే అభి వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రెండు లక్షల కోట్ల పెట్టు బడి పెట్టుబడులు రప్పించి హైదరాబాద్‌ నగరాన్ని అభివద్ధి చేస్తే ఐటీ కంపెనీలన్నీ కర్ణాటక తరలించుకుపోయేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 225000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని కాంగ్రెస్‌ హయాంలో 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్నారు.బి ఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంత పొలాలను గోదావరి నీళ్లతో తడిపిస్తామన్నారు.