కలిసి నడుద్దాం…బీఆర్‌ఎస్‌ను ఓడిద్దాం

– డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..!
– పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు
నవతెలంగాణ-ఖమ్మం
కాంగ్రెస్‌, సీపీఐ నిర్ణయం మేరకు కలిసి నడుద్దామని, మాయల మరాఠీగా పేరొందిన కేసీఆర్‌ను ఓడిద్దామని మాజీ ఎంపి, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు నిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలలో సీపీఐ, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. సీపీఐ పాలేరు నియోజకవర్గ సమావేశం మంగళవారం ఖమ్మం పార్టీ కార్యాలయంలో జరుగుతుండగా అక్కడకు చేరుకొని మద్దతు కోరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, బీఆర్‌ఎస్‌ను తప్పక ఓడించాల్సిన పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామన్నారు. సీపీఐ, కాంగ్రెస్‌ ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలోను ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ఐక్యంగా ముందుకు పోవాలని పొంగులేటి కోరారు. కేసీఆర్‌ ధనబలంతో ముందుకొస్తున్నాడని, దానిని ఎదరించి నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీచేస్తున్న నేపధ్యంలో ఆయన గెలుపు కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కొత్తగూడెంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, తొలుత తాను పోటీ చేయాలని భావించానని, జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాలేరుకు వచ్చానని ఆయన తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి సాంబశివరావు పోటీ చేయడం సంతోషకరమని, ఐక్యతను చాటి మొత్తం జిల్లాలోని 10 స్థానాలలో గెలిచి సీపీఐ, కాంగ్రెస్‌ సత్తాచాటాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాలసాని లక్ష్మినారాయణ, లేళ్ళ వెంకటరెడ్డి, సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌, దండి సురేష్‌, మహ్మద్‌ మౌలానా, సిద్ధినేని కర్ణకుమార్‌, అజ్మీర రామ్మూర్తి, కర్నాటి బానుప్రసాద్‌, మిడికంటి వెంకటరెడ్డి, పుచ్చకాయల కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరికలు
డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని… ప్రజల ఆశీస్సులు… దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్‌, కూసుమంచి మండలాలకు చెందిన వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కూసుమంచి మండలం యర్రగడ్డ తండా సర్పంచ్‌ జర్పుల అనసూర్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో యర్రగడ్డ తండా గ్రామానికి చెందిన సుమారు 300 కుటుంబాలు కాంగ్రెస్‌లోకి చేరాయి. బోడియా తండా బాణోతు వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు చేరాయి. అదే విధంగా పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్‌ అయితగాని రామ్‌గోపాల్‌, జీళ్ల చెర్వు దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్‌ ముద్రబోయిన సత్యనారాయణ, మత్య్సశాఖ సొసైటీ చైర్మన్‌ ముద్రబోయిన వెంకటనర్సయ్యతో పాటు మరికొన్ని కుటుంబాలు జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య, ఇంటూరి పుల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. గన్యా తండా నుంచి 20 కుటుంబాలు, మల్లేపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు కూడా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాయి. ఖమ్మంరూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌ రోడ్డు, 40వ డివిజన్‌లో నివసిస్తున్న సుమారు 100కు పైగా ఒరిస్సాకు చెందిన మైనారిటీ కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాయి. ముత్యాల సురేష్‌, గుమ్మళ్ల శ్రీనివాస్‌, ఒరిస్సా మైనారిటీ అధ్యక్షులు షేక్‌ షెరుద్దీన్‌, మగుబన్‌ బారు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాజశేఖర్‌ రెడ్డి, మల్లయ్య తదితరులు పొంగులేటి సమక్షంలో పార్టీ రూరల్‌ మండల అధ్యక్షులు కల్లెం వెంకట్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. వీరితో పాటు మరికొంతమంది కూడా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జొన్నలగడ్డ రవి, జూకూరి గోపాలరావు వెంకట్‌ రెడ్డి, యడవల్లి రామిరెడ్డి, బొల్లం సుధాకర్‌ రెడ్డి, సర్పంచ్‌ ఖాదర్‌ బాబు, సెట్రం నాయక్‌, ఖలీం, బాణోతు రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్‌: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్‌ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మండలంలోని గొల్లగూడెం, బారుగూడెం, అరేంపుల గ్రామాల్లో మంగళవారం పొంగులేటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రాయల నాగేశ్వరరావు, బండి జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.