దగా…మోసం…!

Lie...cheat...!– ‘సర్వేల’ మాయాజాలం
– తప్పుల తడకగా అంచనాలు
– తిమ్మిని బమ్మిని చేసే కుట్ర
– పాలకులకు సాగిలపడుతున్న
– కార్పొరేట్‌ మీడియా
మన దేశంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో పోల్‌ సర్వేల హడావిడి అంతాఇంతాకాదు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరో 8-10 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే దేశంలో సర్వేల సందడి ప్రారంభమైంది. వివిధ టెలివిజన్‌ ఛానల్స్‌, వార్తా పత్రికలు సొంతంగా కానీ లేదా సర్వే సంస్థల ద్వారా కానీ వీటిని నిర్వహిస్తుంటాయి. వీటినే ఒపీనియన్‌ పోల్స్‌ అంటారు. ఈ సంస్థలే పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహిస్తాయి. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో చెప్పేస్తాయి. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో కూడా జోస్యం చెబుతాయి. కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలు ఎన్నికలకు చాలా కాలానికి ముందే సర్వేలు చేసి, వాటిపై చర్చా గోష్టులు నిర్వహిస్తాయి. అయితే ఈ సర్వేలు నిజమవుతాయా? లేక అంచనాలు తప్పుతాయా? అన్నది అలా ఉంచితే చాలా సందర్భాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రమాదంలో పడేస్తాయి.
ప్రజలను నమ్మించేందుకే…
ఈ సంస్థలన్నీ ఎన్నికల సర్వేల పేరిట మోసానికి పాల్పడడమే కాకుండా వేర్వేరు ఇతర సందర్భాల్లో సైతం తమ సర్వే ఫలితాలను వీక్షకులు, పాఠకుల పైన రుద్దుతున్నాయి. ఉదాహరణకు గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల ప్రశ్నలతో ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి సర్వేలు తెర పైకి వచ్చాయి. ప్రజలను ప్రభావితం చేశాయి. దీంతో చాలా మంది అమాయక ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్నే గుడ్డిగా సమర్ధించారు. రైతుల ఆందోళన, రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం, పెగాసస్‌ గూఢచర్యం వంటి ఉదంతాల సమయంలో కూడా సర్వేలు జరిగాయి. ఈ సర్వేలన్నీ ప్రజలు ప్రభుత్వం వైపే ఉన్నారని నమ్మబలికాయి. ఇంకో విశేషమేమంటే ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ సర్వేలు జరిగేవి. ఆ పర్యటనలు ఫలప్రదంగా జరిగాయని, విదేశాలలో దేశ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని ఒపీనియన్‌ పోల్‌లో ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని ఆ సర్వేలు నమ్మించేవి.
న్యూఢిల్లీ : ఈ సంవత్సరం చివరలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సహజంగానే ఆయా రాష్ట్రాలలో సర్వేల హడావిడి మొదలైంది. కానీ ఇంకా ఆ రాష్ట్రాలలో పొత్తులు ఖరారు కాలేదు. కూటములు ఏర్పడలేదు. ఏ పార్టీ కూడా అభ్యర్థు లను ప్రకటించలేదు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారు? అభ్యర్థులు ఎవరు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది తేలకుండానే ఈ సంస్థలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో, ఎంత శాతం ఓట్లు వస్తాయో తేల్చేస్తుంటాయి. అసలు మన దేశంలో చాలా సందర్భాల్లో పార్టీ సాధించే సీట్లకు, అది పొందే ఓట్లకు పొంతనే ఉండదు. ఈ విషయం సర్వే సంస్థలకూ తెలుసు. ఉదాహరణకు 2014 లోక్‌సభ ఎన్నికలలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం ఓట్లు సాధించింది. అయినా ఆ పార్టీకి ఒక్క సీటూ రాలేదు.
పొత్తులు ఖరారు కాకుండానే…
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కాకుండా రాబోయే లోక్‌సభ ఎన్నికలపై కూడా సర్వే సంస్థలు, మీడియా అంచనాలు వేసేస్తున్నాయి. ఈ సర్వేలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఘన విజయం తప్పదని జోస్యం చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 300 స్థానాలకు పైగా వస్తాయని, ప్రతిపక్ష ఇండియా కూటమికి దక్కేది 200 సీట్ల కంటే తక్కువేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఎన్నికలకు చాలా సమయం ఉండగా ఇలాంటి సర్వేలు చేయాల్సిన అవసరమేమిటి, అవి ఎంతవరకూ సమర్ధనీయం అనేదే ప్రశ్న. ఇదంతా చూస్తుంటే ఈ పోల్‌ సర్వేలను ఎవరు స్పాన్సర్‌ చేస్తున్నారు, దాని వెనుక ఉన్న ఉద్దేశమేమిటి అనేది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఏ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయో ఈ సర్వేలు ఎలా అంచనా వేయగలుగుతున్నాయి? ప్రస్తుతం అనేక పార్టీలు రెండు కూటములతోనూ దోబూచులాడుతున్నాయి. అవి చివరికి ఎవరి వైపు ఉంటాయో చెప్పడం కష్టమే. రెండు కూటములకూ దూరంగా ఒంటరి పోరు సాగించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఇంకా రెండు కూటములూ పొత్తులను ఖరారు చేసుకోలేదు. కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఏయే స్థానాలకు పోటీ చేయాలి అనేది కూడా ఇంకా నిర్ణయం కాలేదు.
అప్పుడే అంచనాలా?
మొత్తంగా చూస్తే ఎనిమిది నెలల తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ చిత్రంలో ఇంకా అస్పష్టతే కన్పిస్తోంది. అయినా సర్వే సంస్థలు మాత్రం ఏ కూటమి గెలుస్తుంది, ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అని అంచనాలు వేసేస్తున్నాయి. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా పలు రాష్ట్రాలలో భాగస్వామ్య పక్షాలు తమకే ఎక్కువ సీట్ల కావాలని పట్టుబడుతున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా తనకు ఏ స్థానం వస్తుందో ఏ పార్టీకీ తెలియదు. ఇలాంటి పరిస్థితులలో విజయావకాశాలపై అంచనాలు వేయడం ఎలా సాధ్యమో అర్థం కాదు. ఏదేమైనా ప్రలోభాలకు లోబడి సర్వేలు నిర్వహిస్తున్న సంస్థల విశ్వసనీయత దారుణంగా దెబ్బ తింటుంది.
ఇటీవల ఓ సర్వే జరిగింది. మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలకు ప్రయోజనం కలిగించిందా లేక హాని కలిగించిందా అని సర్వేలో ప్రశ్నించారట. మరి ప్రజలు ఏమన్నారట? అవిశ్వాస తీర్మానం బీజేపీకి, దాని భాగస్వామ్య పక్షాలకే ప్రయోజనం చేకూర్చిందని, అవిశ్వాసం ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నాయని వారు చెప్పారట. అంతేకాదు…మొత్తం అవిశ్వాసం ఎపిసోడ్‌లో మోడీ ప్రసంగమే హైలైట్‌ అట. ఇలాంటి సర్వేలను ఎవరు స్పాన్సర్‌ చేస్తున్నారో, అవి ఎవరికి లాభం చేకూరుస్తాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
విలువలకు తిలోదకాలు
వాస్తవానికి మన దేశంలో ఇలాంటి సర్వేలన్నీ టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలకు కాసులు కురిపించేవే. వీటి విశ్వసనీయత ఇప్పటి వరకూ ఎన్నడూ నిరూపితం కాలేదు. వాటిపై అనుమానాలు వ్యక్తం చేయడానికి నిర్దిష్ట కారణాలున్నాయి. దేశంలో ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ 1984 సార్వత్రిక ఎన్నికలలో మాత్రమే కచ్చితమైన అంచనాలు వెలువడ్డాయి. చాలా సందర్భాలలో సర్వేలో వచ్చిన ఫలితాలకు, వాస్తవ ఫలితాలకు మధ్య తేడాలే కన్పించాయి. ఇందుకు గత మూడు దశాబ్దాలలో జరిగిన అనేక ఎన్నికలను ఉదాహరణగా చూడవచ్చు. కొన్ని సందర్భాలలో అయితే సర్వేలలో వచ్చిన ఫలితాలకు వాస్తవ ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఆయా సందర్భాలలో సర్వే సంస్థల పైన, మీడియా సంస్థల పైన విమర్శలు వెల్లువెత్తాయి. వాటిపై ప్రజలలో విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. అయినప్పటికీ ఆయా సంస్థలు మాత్రం ఎన్నికల సమయాలలో సర్వేలపై హడావిడి చేస్తూనే ఉన్నాయి. తమ సర్వే ఫలితాలు, అంచనాలు తప్పాయని తేలిన తర్వాత కూడా అవి కనీసం విచారం వ్యక్తం చేయడమో లేదా క్షమాపణ కోరడమో కూడా చేయవు. తద్వారా వృత్తిపరమైన విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి.
అశాస్త్రీయ పద్ధతిలో…
కొన్ని ఇతర దేశాలలో శాస్త్రీయ పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగానే మన దేశంలోనూ నిర్వహిస్తున్నామని ఆయా సంస్థలు చెబుతున్నప్పటికీ అలా జరగడం లేదు. భిన్నత్వంలో ఏకత్వం కన్పించే మన దేశంలో అనేక వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్నాయి. ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లు, భాష, అవసరాలు, సమస్యలు వంటివి ప్రతి 60-70 కిలోమీటర్ల దూరానికీ మారుతుంటాయి. ఈ పరిస్థితులలో కేవలం కొన్ని నియోజకవర్గాలను తీసుకొని, కొద్ది మంది అభిప్రాయాలు సేకరించి, ఓ నిర్ధారణకు రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా అందులో కచ్చితత్వం లోపిస్తుంది. సర్వే సంస్థలకు ఈ విషయం తెలిసినా దానిని అంగీకరించవు. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతుంటాయి. అదే సమయంలో టీవీ మీడియాలో అత్యాశ కన్పిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో బెట్టింగ్‌ వ్యాపారం చేసే వారు, టీవీ మీడియా పరిశ్రమ చేతులు కలిపితే? ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను తమ ఇష్టానుసారం నిర్ణయించి, కోట్లు దండుకోవచ్చు. మరి ఆ శక్తులు చేయలేని పని ఏముంటుంది?