కాఫీతోనూ బొమ్మ’లాటే’

Toy 'latte' with coffeeకాఫీ కప్పులో వివిధ కళాత్మక రూపాలను పాల నురగతో ఆవిష్కరించడాన్నే ‘లాటే ఆర్ట్‌’గా పిలుస్తారు. ఇటలీలో మొదటగా వెలుగులోకి వచ్చిన లాటే -ఆర్ట్‌ అమెరికాకు విస్తరించింది. లాటే ఆర్ట్‌ కోసం ఉపయోగించే కాఫీకి మాత్రం ముందుగా డికాషన్‌ పోసి అనంతరం ఒక పొరలా పాల నురగను పరుస్తారు. ఆ పైన క్రీమ్‌ లేదా మిల్క్‌ చాక్లెట్‌లను పోస్తారు. అనంతరం వాటిపై వివిధ రకాల ఆకృతులను ఆవిష్కరిస్తారు. కాఫీ కప్పును కళాత్మకంగా తీర్చిదిద్దే లాటే ఆర్ట్‌లోనూ రెండు ముఖ్యమైన రకాలున్నాయి. అవి ఫ్రీ పౌరింగ్‌, ఎచింగ్‌. కాఫీ కప్పుపై క్రీమ్‌లేదా మిల్క్‌ చాక్లెట్‌లను పోసిన తరువాత ఒక పాత్రలో పాల నురగను తీసుకొని దాన్ని కాఫీ కప్పుపై ఒక ఆకృతిలో వచ్చేలా పోయడమే ఫ్రీ పౌరింగ్‌. కాఫీ కప్పుపై పరిచిన క్రీమ్‌పై ఒక సన్నటి టూత్‌పిక్‌ లేదా పదునైన కొన ఉన్న ఏదైనా వస్తువుతో వివిధ ఆకృతులను ఆవిష్కరించడాన్ని ‘ఎచింగ్‌’ గా పిలుస్తారు. ‘ఐ లవ్‌ యూ’ అని కాఫీపై రాయించి కొందరు ప్రపోజ్‌ చేస్తుంటే, ప్రేయసి బొమ్మను కాఫీపై వేయించే వారు మరి కొందరు. అందుకే ప్రస్తుతం ‘లాటే ఆర్ట్‌’లో నైపుణ్యం వారికి కాఫీ షాప్‌లలో డిమాండ్‌ ఎక్కువగా ఉంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌