నవతెలంగాణ హైదరాబాద్: ‘మీలా నేనూ మనిషినే సుమా విందు సమావేశానికి ముఖ్యమంత్రి ఆహ్వానించడంతో వెళ్లా. అక్కడే ఉన్న కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా పలకరించా. ఇందులో తప్పేమిటి? ఇది ప్రొటోకాల్ ఉల్లంఘన ఎలా అవుతుంది’ అంటూ కర్నాటక శాసనసభలో స్పీకర్ యూటీ ఖాదర్ ప్రతిపక్షాలను బుధవారం ప్రశ్నించారు. ఐఏఎస్‌ల సేవలను రాజకీయ సమావేశం కోసం దుర్వినియోగం చేశారని, ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ స్పీకర్ పోడియంలోకి వచ్చి ధర్నా చేస్తున్న సమయంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవి రాజకీయాలకు అతీతం, మీరు సోనియాగాంధీ సమావేశానికి వెళ్లడం ద్వారా ప్రొటోకాల్ వ్యవస్ధకు కళంకం తెచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆర్ అశోక్ ఆరోపించడంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాను విందుకు మాత్రమే హాజరయ్యానని, రాజకీయ సమావేశంలో పాల్గొనలేదని స్పష్టత ఇచ్చారు. బీజేపీ నేతలు తనపై నిరాధార నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఆహ్వానించినా తాను భోజనం చేసేందుకు వస్తానని, ప్రతిదాన్నీ రాజకీయ కోణంలో చూడటం సరికాదని స్పీకర్ వ్యాఖ్యానించారు.