సాహితీ వార్తలు

6న ‘వారణాసి – యాత్ర’ ఆవిష్కరణ
యువ జర్నలిస్టు వినోద్‌ మామిడాల రచించిన యాత్రాచరిత్ర ‘వారణాసి’ ఆవిష్కరణ సభ ఈ నెల 6న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ లోని రవీంద్రభారతి పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించున్నారు. సభకు అయినంపూడి శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సభలో నవతెలంగాణ పూర్వ సంపాదకులు ఎస్‌. వీరయ్య, మామిడి హరికష్ణ, మెర్సీ మార్గరేట్‌, వేముల శ్రీనివాసులు, సత్యనారాయణ, పరాంకుశం వేణుగోపాల్‌, దోర్భల బాలశేఖర శర్మ, కోయ చంద్రమోహన్‌ ప్రసంగిస్తారు.
8న ‘హోమ్‌ మేకర్‌’ ఆవిష్కరణ
తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో, కరీంనగర్‌ ఫిల్మ్‌ భవన్‌లో ఈ నెల 8న ఉదయం 10 గంటలకు నాంపల్లి సుజాత కవితా సంపుటి ‘హోమ్‌ మేకర్‌’ ని ప్రముఖ రచయిత్రి అనిసెట్టి రజిత ఆవిష్కరిస్తారు. కందుకూరి అంజయ్య అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో టి.కె. మణిమాల, జి.వి.శ్యాం ప్రసాద్‌లాల్‌, కె.రామలక్ష్మి, గాజోజు నాగభూషణం, బూర్ల వేంకటేశ్వర్లు, తోట నిర్మలారాణి, ఏదునూరి రాజేశ్వరి, సి.వి. కుమార్‌ అతిథులు గా పాల్గొంటారు. – రవీందర్‌ విలాసాగరం
నేడు పాలమూరు సాహితి అవార్డు ప్రదానం
పాలమూరు సాహితి అవార్డుకు ప్రముఖ కవి డాక్టర్‌ జెల్ది విద్యాధర్‌ రావు రచించిన ‘అంతరంగపు భాష’ కవితా సంపుటి ఎంపికైంది. ఈ పురస్కార ప్రదానోత్సవం మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని లిటిల్‌ స్కాలర్స్‌ హై స్కూల్‌ లోని కాళోజీ హాల్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. జిల్లా కళాకారుల సంస్థ అధ్యక్షులు వల్లపురెడ్డి మనోహర్‌ రెడ్డి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కతిక శాఖామంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌ గౌడ్‌ రానున్నారు. విశిష్ట అతిథిగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ స్వర్ణసుధాకర్‌ రెడ్డి, గౌరవ అతిథిగా హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, ఆత్మీయ అతిథిగా కోట్ల వెంకటేశ్వరరెడ్డి లు హాజరు కానున్నారు. వివరాలకు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ 9032844017 నంబరు నందు సంప్రదించవచ్చు.
సమ్మెట ఉమాదేవికి ఎం.ఎస్‌.ఆర్‌. సాహితీ పురస్కారం
ఎం.ఎస్‌.ఆర్‌ సాహితీ పురస్కారానికి కథా రచనతో పాటు బాలసాహిత్యంలో విశేషంగా కషి చేస్తున్న ప్రముఖ కథా రచయిత్రి సమ్మెట ఉమాదేవికి అందించనున్నట్టు ఎం.ఎస్‌.ఆర్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు మలిశెట్టి శ్యాంప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో హైదరాబాదులో నిర్వహించే సాహితీ కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేస్తామన్నారు. కథా ప్రపంచం ఉత్తమ కథా సంకలనం కోసం ఎంపిక చేసిన మొదటి నాలుగు కథలు వరుసగా తల్లికూతురు మధ్యలో ఆమె (దేశరాజు, హైదరాబాద్‌), ఉన్నోడు లేనోడు (మూరిసెట్టి గోవింద్‌, కార్వేటి నగరం), వేకువ నక్షత్రం (బి.కళాగోపాల్‌, నిజామాబాద్‌), కప్పు తేనీరు (టి.వి.ఎల్‌. గాయత్రి, పూణె) ఎంపికయ్యాయి.
షేక్‌ హుసేన్‌ సత్యాగ్నికి జీవిత సాఫల్య పురస్కారం
కవిత విద్యా సంస్కతిక సేవా సంస్థ అందించే జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్‌ రచయిత, తొలి తెలుగు ముస్లిం కథకుడు షేక్‌ హుసేన్‌ సత్యాగ్నికి అందించనుంది. ఈ నెల 15న కడపలోని సిపి బ్రౌన్‌ గ్రాంథాలయంలో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇదే కార్యక్రమంలో భాషా, సామాజిక సేవల్లో కషి చేసిన పలువురికి గౌరవ సత్కారం చేయనున్నారు. వివరాలకు 9177013845 నంబరు నందు సంప్రదించవచ్చు.
డా|| యం.పురుషోత్తమాచార్యకు తంగిరాల కృష్ణప్రసాద్‌ స్మారక అవార్డ్‌
తంగిరాల కృష్ణప్రసాద్‌ 24వ స్మారక అవార్డ్‌ను జాతీయ పురస్కార గ్రహీత డా|| ముడుంబై పురుషోత్తమాచార్యకు అందివ్వనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు నల్గొండలోని ఎం.వి.ఎన్‌. విజ్ఞాన్‌ భవన్‌ ఆఫీసులో తంగిరాల మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సభలో ట్రస్ట్‌ చైర్మన్‌ తంగిరాల చక్రవర్తి, నవతెలంగాణ ఫ్యూచర్‌ ఎడిటర్‌ కె.ఆనందాచారి, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.చంద్రమోహన్‌, బాలసాహిత్యవేత్త పుప్పాల కృష్ణమూర్తి, సమతాసేవా సమితి కార్యదర్శి కళారత్న చింతా వెంకటేశ్వర్లు, కవి, రచయిత సాగర్ల సత్తయ్య, కవి బి. గోపీకృష్ణ, తెలంగాణ సాహితి కోశాధికారి ఎ. మోహన్‌కృష్ణ, కె.వి.ఎన్‌.ఎల్‌. ప్రసన్న కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.