
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రాత్రి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఇళ్లలో చోరికి పాల్పడినట్లు ఎస్సై సిలివేరి మహేష్ తెలిపారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మోతె శ్రీ నివాస్ రెడ్డి,మెండె సాయిలుకు చెందిన ఇళ్ల తాళాలు పగలగొట్టి శ్రీనివాస్ ఇంటి నుండి 20 వేల రూపాయల నగదు, పది తులాల వెండి నగలు, మెండె సాయిలు ఇంటి నుండి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు వారు తెలిపారు. దొంగలు పడ్డ సమయంలో బాదితులు ఇంట్లో లేరని తాళం వేసి తమకే చెందిన వేరే ఇళ్లల్లో నిద్రిస్తున్నారని తెలిపారు. బాదితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లుజ్ టీం ను రప్పించి వేలిముద్రలను సేకరించారు. గ్రామానికి వచ్చే రహదారుల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు.
తాళం కనబడితే అంతే సంగతులు..
గత కొన్ని రోజులుగా డిచ్ పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆయా గ్రామాలలో తాళం వేసి ఉన్న నివాస గృహాలే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు జోరబడి అందిన కాడికి దోచుకొని వెళ్తున్నారు. గత కొంతకాలంగా రెండు మండలాల్లో లక్షలాది రూపాయల దొంగతనం జరుగుతున్న ఇప్పటి వరకు దొంగలను పోలిసులు పట్టుకోకపోవడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.