న్యూఢిల్లీ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం నాడిక్కడ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కె. రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ దీక్షకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుతోపాటు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు, ఢిల్లీలోని తెలుగువారు మద్ధతు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వారంతా ఖండించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సత్యాగ్రహ దీక్షను చిన్నారులు లోకేష్‌కు నిమ్మరసం ఇచ్చి సత్యాగ్రహ దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు మంచి పనులు చేస్తే సైకో జగన్ జైలుకి పంపించారని విమర్శించారు. ”మహాత్మాగాంధీ లాంటి వారు నమ్ముకున్న సిద్దాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో అమలయిన స్కిల్ డెవలప్‌మెంట్ ఏపీలో అమలు చేస్తే చంద్రబాబు నాయుడును సైకో జగన్‌రెడ్డి జైల్‌కు పంపారు. చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తే ఏపీకి పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబును జైలుకు పంపాలని పని చేస్తోంది. ఏమి లేని కేసులో చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఏపీ ప్రజలు ఆలోచించాలి ప్రజలు, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పటి నుంచి జగన్ పేరు మార్చాను.. ఆయన సైకో కాదు..పిచ్చి జగన్. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు. పిటీ వారెంట్ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. నాపై జగన్‌రెడ్డి మూడు కేసులు సిద్ధం చేశారు. కొందరు వైసీపీ మంత్రులు నన్ను జైలుకు పంపిస్తాం అంటున్నారు. వీలైతే అమ్మ భువనేశ్వరిని జైలుకు పంపిస్తా అంటున్నారు. మేము తగ్గేదేలే…. మా పోరాటం ఆగదు. ఇప్పటికీ నాపై మూడు కేసులు ఉన్నాయి. రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. నా శాఖకు సంబంధ లేని నిర్ణయాలు. కోర్టులు మమ్మల్ని కాపాడుతాయి. పిచ్చోడు జగన్ చేసే నిర్ణయాలు ఇవి. అందుకే జగన్ పేరు పిచ్చి జగన్. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసులో క్వాష్ పిటీషన్ వస్తుంది. కోర్టు నిర్ణయాలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం” అని నారా లోకేష్ పేర్కొన్నారు.