– మా వాటా మాకు రావాల్సిందే..
– అతి పెద్ద సమస్య కుల వ్యవస్థను నిర్మూలించాలి : తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
– టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న అర్హులందరికీ వెంటనే లాంగ్ పెండింగ్ ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విద్యుత్ యాజమాన్యాల వైఖరికి నిరసనగా బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంమనోహర్, రమేశ్ మాట్లాడుతూ.. ప్రమోషన్ల విషయంలో విద్యుత్ యాజమాన్యాలు మొండి వైఖరి వీడాలన్నారు. అర్హులైన జేఎల్‌ఎం కేడర్ నుంచి సీజీఎం స్థాయి వరకు వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. కోర్టు కేసు పేరుతో రివర్షన్ ఇచ్చిన తెలంగాణ ఉద్యోగులందరికీ తిరిగి ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. మెరిట్ కమ్ సీనియార్టీపై ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేయాలన్నారు. అమలులో ఉన్న కాన్సిక్వెన్షియల్ సీనియార్టీనే కొనసాగించాలన్నారు. 85వ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చిన హక్కులకు భంగం కలిగిస్తున్న కాలం చెల్లిన క్యాచ్ ఆఫ్ రూల్‌ను అమలు చేయాలనే కుట్రను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్జీజన్లకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ వర్తింపజేయాలని కోరారు.
దేశానికి అతి పెద్ద సమస్య కుల వ్యవస్థ అని, దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బీసీ అయి ఉండి కూడా బీసీ జనగణన చేయడం లేదన్నారు. లౌకికత్వం, సోషలిజాన్ని ప్రధాని మోడీ తీసేశారని చెప్పారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీల ప్రమోషన్లను తీసేయడానికి బీసీ ఉద్యోగులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తమ హక్కులను దొడ్డి దారిన తీసేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లు వస్తే ఓర్వలేకపోవడం సరికాదన్నారు. ఎవరి భిక్ష అవసరం లేదని, తమ వాటా తమకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యుత్ యాజమాన్యాల విధానాలకు ఉద్యోగులు బలవుతున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టిజన్ల పాత్ర మరువలేనిదని, వారిని పర్మినెంట్ చేయాలన్నారు. ఈ ధర్నా శాంపిల్ మాత్రమే అని, సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్‌లో విద్యుత్ సౌధలో మరో కార్యక్రమానికి సిద్ధమవుతామని తెలిపారు. విద్యుత్ యాజమాన్యాలు తమ డిమాండ్లను పెడచెవిన పెడితే సీఎం కేసీఆర్‌కు మెమోరాండం అందజేయడం, అఖిలపక్ష నేతలకు మెమోరాండం సమర్పణ, వారితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అలాగే కార్పొరేట్ ఆఫీసుల ఎదుట రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రయ్య, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ప్రెసిడెంట్ ఆనంద్‌బాబు, ఎన్‌పీడీసీఎల్ ప్రెసిడెంట్ ఆనందం, కుమారస్వామి, జెన్‌కో ప్రెసిడెంట్ నాగరాజు, రమేష్, ట్రాన్స్‌కో ప్రెసిడెంట్ శరబంద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.