ప్రేమంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవడం. ప్రేమించే వ్యక్తి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. అలాంటి ప్రేమ తరగని నిధిలా ఉండాలి. కాలంతో పాటు కరిగి పోకూడదు. ఇక ప్రేమించి పెండ్లి చేసుకున్న వారి మధ్య ఆ ప్రేమ మరింత రెట్టింపు కావాలి. బాధ్యతలు పెరిగినా ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ బాధ్యతలు ఎంతో హాయిగా ఉంటాయి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమస్యతోనే రాధిక ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
రాధిక ఇంటర్‌లో వున్నప్పుడు రాఘవను ప్రేమించింది. రాధిక వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర రాఘవ ఉండేవాడు. ఒక ఫంక్షన్‌లో ఇద్దరికీ పరిచయం. ఆ పరిచయమే తర్వాత ప్రేమగా మారింది. అప్పట్లో రాధిక అడక్కపోయినా తనకు ఏం కావాలో తెలుసుకొని మరీ చేసేవాడు. ఇలా ఐదేండ్లు గడిచాయి. రాధిక బంధువులకు వాళ్ళ ప్రేమ గురించి తెలిసింది. ‘ఆ అబ్బాయికి తాగే అలవాటు ఉంది. ఎలాంటి ఉద్యోగం లేదు. వాళ్ళ కుటుంబం కూడా అంత మంచిది కాదు, గొడవలు చేస్తుంటారు, అతన్ని పెండ్లి చేసుకుంటే కష్టాలు తప్పవు’ అని చెప్పారు. అప్పటి నుండి రాధిక అతనితో మాట్లాడటం మానేసింది. రాఘవ మాత్రం రోజూ ఆమె కాలేజీ చుట్టూ తిరిగేవాడు. ‘ఎందుకు నాతో మాట్లాడటం మానేశావు. నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా నేను ఉండలేను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నాతో మాట్లాడు’ అని బతిమాలాడు.
‘నీకు తాగే అలవాటు ఉంది. ఎప్పుడూ గొడవలు చేస్తావంట! అవి మానేసి నా దగ్గరకు రా. అప్పుడు నీతో మాట్లాడతా’ అంది రాధిక. ‘నాది నిజమైన ప్రేమని నిరూపించుకుంటాను. అప్పుడే నీకు నా ముఖం చూపిస్తాను. తాగడం మానేస్తాను’ అంటూ వెళ్ళిపోయాడు. అలా ఆమెకు రెండేండ్లు దూరంగా ఉన్నాడు. రాఘవ అన్నట్లుగానే తాగడం పూర్తిగా మానేశాడు. ‘గొడవలకు దూరంగా ఉంటున్నాడు. స్నేహితులతో తిరగడం లేదు. ఎలాంటి గొడవలు లేవు. మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మారిపోయాడు’ అంటూ రాధిక బంధువులే ఆమెకు చెప్పారు.
రాఘవలో వచ్చిన మార్పుతో వారి ప్రేమ మళ్ళీ మొదలైంది. ఇద్దరూ తమ ప్రేమ గురించి పెద్దవాళ్ళకు చెప్పారు. వాళ్ళు ఒప్పుకోలేదు. స్నేహితుల సహాయంతో గుళ్ళో పెండ్లి చేసుకున్నారు. కూతురు ఇష్టం లేని పెండ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు రాధికతో మాట్లాడటం మానేశారు. రాఘవ తల్లిదండ్రులు మాత్రం ఆరు నెలల తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. రాఘవ లేనప్పుడు వాళ్ళ అత్త ‘పెండ్లయి ఇన్ని రోజులైనా ఇంకా పిల్లలు లేరు, నీకింక పిల్లలు కారు’ అంటూ రాధికను ఏదో ఒకటి అంటుండేది. ‘వంట బాగోలేదు, బట్టలు ఉతకడం రాదు’ అంటూ ఇలా ప్రతి విషయంలో ఏదో ఒకటి అంటూనే ఉండేది. ఏడాది తర్వాత రాధిక గర్భవతి అని తెలిసింది. రాఘవ తల్లి ‘పిల్లలు పుడితే ఎవరు చూస్తారు, మీ అమ్మ వాళ్ళు నీతో మాట్లాడటం లేదు. వచ్చి మాతో ఉండండి’ అన్నది. కానీ రాఘవకి అక్కడికి వెళ్ళడం ఇష్టంలేదు. ‘మా ఇంట్లో అందరూ తాగేవాళ్ళే. నేను అక్కడికి వెళితే పాత స్నేహితులు కలుస్తారు. బలవంతంగానైనా తాగిస్తారు’ అన్నాడు.
కానీ రాధిక ‘మనకు పిల్లలు పుడతారు. వాళ్ళను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. మీ అమ్మ మనకు సాయంగా ఉంటుంది. తనే రమ్మని అడుగుతుంది. మనం పోకపోతే బాధపడుతుంది. తల్లీ కొడుకులను విడదీసిన పాపం నాకెందుకు’ అంటూ ఎలాగో రాఘవను ఒప్పించింది. రాధికకు బాబు పుట్టాడు. తర్వాత రాధిక తల్లిదండ్రులు కూడా ఆమెకు దగ్గరయ్యారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో రాఘవ మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. రాధిక వారిస్తే తాగేవాడు కాదు. కానీ ఆ మధ్య వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుండి తాగడం ఎక్కువైంది. ‘ఎందుకు ఇలా తాగుతున్నావు’ అంటే ‘అమ్మ చనిపోయిన బాధ, తమ్ముడి పెండ్లి’ అంటూ ఏదో వంకతో తాగుతూనే ఉండేవాడు.
కొన్నాండ్లకు పాప పుట్టింది. రాఘవ స్నేహితులతో తిరగడం ఎక్కువైంది. అర్ధరాత్రి వరకు బయటే వుండేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే రాధికను కొట్టేవాడు. రెండు మూడు సార్లు అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు నెట్టేశాడు. మీ ఇంటికి వెళ్ళిపో అనేవాడు. రాధిక గుమ్మం బయటనే కూర్చునేది. మత్తు దిగిన తర్వాత సారీ చెప్పేవాడు. ఇంట్లో వాళ్ళను కాదనుకుని చేసుకుంది. దాంతో తన బాధలు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది. ఎలాగైనా భర్తను మార్చుకోవాలనుకుంది. కానీ లాభం లేదు. రాధిక ఏదైనా అంటే ‘నీకు ఇష్టం లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపో, నీకు దిక్కున్న చోట చెప్పుకో. నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను’ అనేవాడు. అప్పటికి వాళ్ళ పెండ్లి జరిగి 18ఏండ్లు. రాఘవ, రాధికతో మాట్లాడటం మానేశాడు. ఆమె ఏమైనా చెప్పినా వినిపించుకోడు. ప్రతి దానికి చికాకు పడతాడు. లేదా గట్టిగా అరుస్తాడు. ‘పిల్లల ముందు అలా చేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు’ అని రాధిక ఏం మాట్లాడకుండా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలిసిన వారి ద్వారా ఐద్వా లీగల్‌సెల్‌కి వచ్చి…
‘నా జీవితం ఎందుకు ఇలా తయారైంది. నేనూ మనిషినే కదా! నాకూ కోరికలు ఉంటాయి కదా! వాటిని మాత్రం పట్టించుకోడు. నాకు చనిపోవాలనిపిస్తుంది. కానీ నేను చనిపోతే నా ఇద్దరు పిల్లలను ఎవరు చూస్తారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన సమస్యకు ఓ పరిష్కారం చెప్పమంటూ లీగల్‌సెల్ సభ్యులను వేడుకుంది. ‘గతంలో నాతో గంటలు గంటలు మాట్లాడేవాడు, నిన్ను చూడ కుండా ఉండలేను అన్నాడు. ఇప్పుడు నావైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. పెండ్లి తర్వాత ప్రేమ తగ్గి పోతుందా? పెండ్లి తర్వాత ప్రేమ పెరగాలి. కానీ ఇదేంటీ నా జీవితంలో ఇలా జరుగుతుంది. నాకేం అర్థం కావడం లేదు. ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచనలతో పిచ్చెక్కు తుంది. అందుకే ఈ మధ్య ఉద్యోగానికి వెళుతున్నాను. రాఘవ నాతో కనీసం రెండు నిమిషాలు మాట్లాడినా చాలు అనిపిస్తుంది. ఆయనకు ఈ విషయం అర్థం కావడం లేదు’ అంటూ బాధపడింది.
లీగల్‌సెల్ సభ్యులు రాఘవని పిలించి మాట్లాడితే ‘రాధిక అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. ఆమె లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను. అయినా నేను ఆమెకు ముందే చెప్పాను. మా వాళ్ళతో కలిసి ఉంటే తాగుడు అలవాటు అవుతుందని. నా మాట వినిపించుకోకుండా అందరితో కలిసి ఉంటే బాగుం టుందంటూ తీసుకువచ్చింది. నా స్నేహి తులు, బంధువులు నేను తాగను అంటే ఎగతాళి చేసే వారు. అందుకే మళ్ళీ తాగడం మొదలుపెట్టా’ అన్నాడు.
దానికి సభ్యులు ‘నువ్వేమి చిన్న పిల్లాడివి కాదు. ఎవరో ఏదో అంటున్నా రని తాగుతూ నీ భార్యా, పిల్లల్ని ఇబ్బంది పెడతావా? పైగా రాధికను కొడుతున్నావు. మాట్లాడడం మానేశావు. నిన్ను నమ్మి నీతో వచ్చింది. అలాంటి రాధికకు అన్యాయం చేస్తావా? బంధులు ఎగతాళి చేస్తే కొన్ని రోజులు చేస్తారు. తర్వాత వాళ్ళే మానేస్తారు. ఇప్పుడు చూడు నీ జీవితం ఎలాంటి స్థితికి వచ్చిందో. రాధిక నీకోసం ఎంతగా బాధపడుతుందో అర్థం చేసుకో. మీరు ప్రేమించిన రోజులు ఒకసారి గుర్తు చేసుకో. ఆమెతో కలిసి ఉండటానికి ఎంతగా ప్రయత్నించావు. నీ అలవాట్లు మానుకున్నావు. నీ ప్రేమ కోసం మళ్ళీ ఇప్పుడు అలా చేయలేవా? కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా దూరంగా వెళ్ళి వుండండి. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా బాగున్నట్టు లేదు. నిన్ను భరించలేక రాధిక నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో’ అన్నారు.
లీగల్‌సెల్ వారు చెప్పింది విన్న అతను కాస్త ఆలోచనలో పడ్డాడు. ‘మీరు చెప్పింది నిజమే. నా వల్ల రాధిక, పిల్లలు చాలా బాధపడుతున్నారు. మీరు చెప్పినట్టు ఇక తాగడం మానేస్తా. నా స్నేహితులకు, బంధువులకు దూరంగా ఇల్లు చూసుకుంటాం. ఇకపై రాధికకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా’ అని చెప్పి రాధికకు సారీ చెప్పి ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
– వరలక్ష్మి, 9948794051