పదమూడేండ్ల వయసులో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య ప్రియాషా సలుజా వ్యాపార వేత్తగా మార్చింది. ఇష్టమైన ఆహారం తీసుకోడానికి తనలా ఇబ్బంది పడుతున్న వారికి పరిష్కారంగా 2019లో ది సిన్నమోన్ కిచెన్‌ను ప్రారంభించింది. ఆహారం పట్ల ఆమెకున్న ఇష్టాన్నే వృత్తిగా మలుచుకుంది. కోట్లల్లో వ్యాపారం చేస్తూ గొప్ప మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగి ప్రజలకు ప్రిజర్వేటివ్ రహిత ఉత్పత్తులను అందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ప్రియాషా సలుజా తన 13 ఏండ్ల వయసులో పీసీఓఎస్ బారిన పడింది. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే ఆమె అప్పటి నుండి ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవల్సి వచ్చింది. అది ఆమెకెంతో కష్టంగా మారింది. ‘ఆ సమయంలో పీసీఓఎస్ గురించి పెద్ద చర్చ జరిగేది కాదు. అవగాహన చాలా తక్కువగా ఉండేది. దాంతో నా ఆరోగ్య పరిస్థితి రీత్యా ఎన్నో సవాళ్లను, అవమానాలను ఎదుర్కొంటూ పెరిగాను’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. ఆ పరిస్థితులే ఆమెను దీనిపై మరింత పరిశోధన చేయించాయి. పరిష్కారంగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. పిసిఒఎస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన 9 ఏండ్ల తర్వాత అంటే 2018లో ప్రియాషా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది.
దానికి పరిష్కారంగా…
వంటకాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి చిట్కాలను అందులో పొందుపరిచేది. ‘ప్రజలు ఆరోగ్యంగా తినాలని కోరుకుంటున్నారు. కానీ సమయం, డబ్బు, ఆసక్తి వంటివి లేకపోవడంతో ఇంట్లో తయారు చేసుకోడానికి వారు సిద్ధంగా లేరని గుర్తించాను. దీనికి పరిష్కారంగానే ది సిన్నమోన్ కిచెన్‌ను ప్రారంభించాను’ ఆమె చెప్పారు. సిన్నమోన్ కిచెన్ 100% గ్లూటెన్-ఫ్రీ, ప్రిజర్వేటివ్-ఫ్రీ, రిఫైన్డ్ షుగర్-ఫ్రీ, ఫ్లోర్-ఫ్రీ, ప్లాంట్-బేస్డ్ డి2సి ఉత్పత్తులను అందిస్తుందని ఆమె అంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా కుకీలు, చిప్స్, కేకులు, బ్రెడ్‌తో పాటు మరెన్నో ఉత్పత్తుల అందిస్తుంది. ‘స్వీట్లంటే నాకు చాలా ఇష్టం. నా ఇష్టాన్నే వృత్తిగా మార్చుకున్నాను’ అని ఆమె చెప్పింది.
వంట పట్ల ప్రేమతో…
ఆమె జీవితంలో ఆహారం ఓ అంతర్భాగమైంది. ‘నా కుటుంబంలో అందరూ వంట బాగా చేస్తారు. అందరూ ఉత్తర భారత వంటకాలను చేస్తుంటే, నేను ఎడారి ప్రాంత వంటలపై దృష్టిపెట్టాను. ముఖ్యంగా స్వీట్లను ఎక్కువగా తయారు చేస్తాను’ అని ఆమె అంటుంది. ప్రియాషా పాఠశాలలో చదివేటపుడు తన స్నేహితురాలి కోసం మొదటి సారి కేక్ తయారు చేయడానికి ప్రయత్నించింది. ఆ కేక్ సరిగా తయారు కానప్పటికీ ఆ సంఘటన ఆమె జీవిత గమనాన్ని మార్చేసింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్క కేక్ మాత్రమే కాదు పట్టుదలతో ఘేవార్, మలై పెధాతో పాటు రకరకాల వంటకాలతో ప్రయోగాలు చేస్తూనే ఉంది.
ఉద్యోగం నచ్చలేదు
నోయిడాకు చెందిన సలుజా ఢిల్లీ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత పిడబ్ల్యూసి పన్నుల విభాగంలో చేరింది. క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని అనుకుంటున్న సమయం ఇది. అందుకే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్‌లోకి వెళ్లాలనుకుంది. వెంటనే ణవఅర్‌బ ×అష.లో చేరింది. అక్కడ పార్లే, ఐటిసి మొదలైన బ్రాండ్‌లతో పనిచేసింది. ‘నచ్చిన మార్కెటింగ్‌లో చేరినప్పటికి నా ఆలోచనలకు అక్కడ ప్రాధాన్యం లేదు. నా అభిప్రాయాలకు చోటు లేదు. దాంతో నాకు స్వేచ్ఛకావాలనిపించింది’ ఆమె చెప్పింది. 2019లో సోషల్ మీడియా ద్వారా ముంబైకి చెందిన ఒక బ్రాండ్ గురించి తెలుసుకుంది. వారు తమ ఈవెంట్‌లో ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయవల్సిందిగా ఆమెను కోరారు. ఎంతో ఉత్సాహంగా ఆ ఈవెంట్‌లో పాల్గొంది. తర్వాత ఆమెకు చాలా ప్రశంసలు వచ్చాయి. ఆ ధైర్యంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంది.
సవాళ్లు ఉన్నప్పటికీ…
కేవలం రూ.50,000 పెట్టుబడితో ఇంటి వంటగదిలోనే తన కంపెనీని ప్రారంభించింది. మొదట్లో వారానికి రెండు, మూడు ఆర్డర్లు వచ్చేవి. దీంతో భవిష్యత్‌లో వ్యాపారం ఎలా నడుస్తుందో అని కాస్త కంగారు పడింది. ‘నేను ఒకపక్క నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. మరోపక్క ఆర్డర్లు సరిగా రాలేదు. ఇది క్లిష్ట పరిస్థితిగా అనిపించింది’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ తన ప్రయత్నాలను కొనసాగించింది. తర్వాత కాలంలో రోజుకు రెండు, మూడు ఆర్డర్‌లకు పెరిగి ఆపై పది ఆర్డర్‌లకు ఆమె వ్యాపారం వృద్ధి చెందింది. ‘వ్యాపార వేత్తగా ఉండటం అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న పాత్ర మనది. ఈ పని అత్యంత సవాలుగా ఉన్నప్పటికీ మంచి గుర్తింపునిస్తుంది’ అని ఆమె జతచేస్తుంది. మహిళా వ్యాపారవేత్తగా తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడుతూ ‘లింగ వివక్ష నాకు వ్యక్తిగత సవాలుగా అనిపించలేదు. అందరినీ సమానంగా చూడాలి అనే వాతావరణంలో నేను పెరిగాను. దానికి తోడు నాతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా నన్ను స్వాగతించి సహకరించారు’ అని చెప్పింది.
బేకింగ్ వర్క్‌షాప్‌లు
‘చక్కెర లేని, ప్రిజర్వేటివ్‌లు లేని’ ఉత్పత్తులను అందించడమే కాకుండా తన వినూత్న వంటకాల పట్ల ఆమె గర్వంగా ఉంది. ఈమె వ్యాపారంలో 80% పైగా మహిళా శ్రామిక శక్తి కూడా ఉంది. ఇంకా మహిళల కోసం ఆమె బేకింగ్ వర్క్‌షాప్‌లను నిరంతరం నిర్వహిస్తుంది. ఈ వర్క్‌షాప్‌లు మూడు గంటలు ఉంటాయి. దీనికి రూ. 1,750 ఖర్చు అవుతుంది. చాలా మంది గృహిణులు ఈ వర్క్‌షాప్‌లలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆమె చెబుతుంది. సిన్నమోన్ కిచెన్‌కి వెబ్‌సైట్‌తో పాటు దీశ్రీఱఅసఱ్, Aఎaఓశీఅ, ూవ వీaతీషష్ట్రవ వంటి వాటి ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయే ఏడాదిలో ఉత్పత్తుల సంఖ్యతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లను పెంచడంపై దృష్టి పెట్టాలని ఆమె భావిస్తుంది.
రుచితో పాటు ఆరోగ్యం
ప్రారంభంలో ఆమె నట్ బటర్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలను అందిస్తూ తన వెంచర్‌ను ప్రారంభించింది. అయితే దీని కోసం కష్టమర్లు రెండు రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. దాంతో వాళ్ళు మరోసారి ఆర్డర్ ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. అందువల్ల ది సిన్నమోన్ కిచెన్ కింద బేకరీ ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె ఢిల్లీ అంతటా తన కేక్‌లను అందిస్తుంది. కంపెనీ తొలి ఏడాది రూ.1,40,000 వ్యాపారం చేసింది. తర్వాతి ఏడాది ఇది రూ. 12,50,000 అమ్మకాలను చూసింది. ఈ ఏడాది సుమారు రూ. 6 కోట్ల విక్రయాలు జరగొచ్చని అంచనా వేస్తోంది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో మా బ్రాండ్‌గా ప్రారంభించాము. కస్టమర్లకు అసలు ఏమి అవసరమో తెలుసుకోవడానికి వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది నాకు సహాయపడింది’ ఆమె చెప్పారు.