ప్రేమా ఓ ప్రేమా

Love oh loveఈరోజు ప్రేమికుల దినోత్సవం. విశ్వాన్ని నడిపించే ప్రేమకు ఒక రోజేంటీ. ప్రతి రోజూ ప్రేమ మయమే. ప్రేమ ఒక నిరంతర ప్రవాహం. ప్రేమంటే ఓ అందమైన అనుభూతి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కానీ నేటి తరం ప్రేమకున్న అర్థాన్ని మార్చేస్తుంది. ఇచ్చిపుచ్చుకునే ఓ వ్యాపారంగా ప్రేమ మారిపోయింది. ఎంత ఖరీదైన బహుహతి ఇస్తే అంత గొప్పగా ప్రేమిస్తున్నట్టు భావిస్తున్నారు. యువత ఆలోచనలు అడ్డుపెట్టుకొని ఈరోజున పెట్టుబడి దారులు కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. కానీ నిజమైన ప్రేమంటే ఇది కాదు. ప్రేమకు మరణం లేదు. గెలిచి ఓడినా… ఓడి గెలిచినా ప్రేమ… ప్రేమే. కొందరి జీవితాల్లో ప్రేమ ఎంతో మధురంగా ఉంటే మరికొందరి జీవితాల్లో చేదుని మిగుల్చుతుంది. ఈ ప్రేమ ఎక్కడ ఎప్పుడు ఎలా పడుతుందో చెప్పడం కష్టం.
‘ప్రేమంటే పరస్పరం చూసుకోవడం కాదు. ఇద్దరూ ఒకే దృష్టికోణంలో బయటి ప్రపంచాన్ని చూడడం’ అన్నాడు ఒక ఫ్రెంచి రచయిత. ఆనందానికి ద్వారాలు తీసే ప్రేమను ఎవరైనా ఆహ్వానిస్తారు. అటువంటి ప్రేమ కోసం వేచిచూస్తారు. కానీ నేటి ప్రేమల్లో వేచిచూడటం శుద్ద దండగనుకుంటున్నారు. ప్రస్తుత బిజీ జీవితంలో ప్రేమ కూడా వేగంగా పరుగులు తీస్తుంది. అప్పటికప్పుడే మారిపోతుంది. ఆ వేగం, మార్పు ఎంతగా అంటే ప్రేమిస్తున్న వారికి కూడా అందనంతగా. దాంతో ప్రేమకంటూ ఒక రోజును సృష్టించేశారు. అందుకే ఈ రోజు ప్రేమికులకు ఓ ప్రత్యేకమైపోయింది. విలువైన బహుమతులు, పార్కులు, సినిమాలు, షికార్లు ఇవే ప్రేమంటే అని చెబుతుంది ఈ రోజు.
నిజమైన ప్రేమలో…
ప్రేమను వర్ణించడం సులువే, కానీ నిర్వచించడమే కష్టం. ప్రేమించటం, ప్రేమించబడటం ఒక గొప్ప అనుభూతి. అది నిజమైన ప్రేమైతే ఇక జీవితమంతా సుఖప్రదమే. నిజమైన ప్రేమలో అనుమానానికి తావుండదు. నమ్మకమే అక్కడ రాజ్యమేలుతుంది. ప్రేమించిన వారు పొరపాటు చేసినా ఆ ప్రేమ ముందు పొరపాటు దూదిపింజలాంటిదే. కష్టాలను, బాధలను నిజమైన ప్రేమ మైమరపింపచేస్తుంది. నీకు నేనున్నాననే నమ్మకాన్ని కలిగిస్తుంది. చిన్న చిన్న గిల్లికజ్జాలు వచ్చినా వారి మధ్య వున్నటువంటి స్వచ్ఛమైన ప్రేమ ముందు అవి ఏపాటివి. అందుకే కాలం పరుగులు తీస్తున్నా ప్రేమ మాత్రం చిరకాలం ఉంటుంది. శతాబ్దాలు గడుస్తున్నా ప్రేమకున్న గొప్పదనం పెరుగుతూనే ఉంది.
అమ్మకాల కోసమే ప్రేమికులు
అయితే నేటి ఆధునిక ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ కలుషితమవుతుంది. ప్రేమంటే కేవలం కొంత కాలం సరదాగా గడపడం. ప్రేమించుకున్న వారు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే అదే నిజమైన ప్రేమ. ఈ భావాన్ని ప్రపంచీకరణ యుగం మరికాస్త పెంచిపోషిస్తోంది. తాము ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాల కోసం ప్రేమను, ప్రేమికులను సృష్టిస్తోంది. అలా సృష్టించిన ప్రేమ ఎంతకాలం మనగలుగుతుంది. సరిగ్గా ప్రేమించడం కొందరికే తెలుసు. ఆ ప్రేమను నిలుపుకోవడం చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే నేటి ప్రేమలు ఎక్కువకాలం నిలవలేక మధ్యలోనే కనుమరుగవుతున్నాయి. ఫలితంగా నిజమైన ప్రేమకు సైతం ఈ ప్రపంచీకరణ యుగంలో విలువ లేకుండా పోతుంది. ఈ మాయ నుండి ఇప్పటికైనా బయట పడదాం. ఈర్ష్యా, ద్వేషం, స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకుందాం.
ప్రేమ పేరుతో దాడులు
ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఒక అమ్మాయి తనని కాదంటే నేటి తరం భరించలేక పోతుంది. తమకు దక్కని అమ్మాయి ఇంకెవరికీ దక్కకూడదని దాడులకు తెగబడుతున్నారు. అమ్మాయీ ఓ మనిషే అని మర్చిపోతున్నారు. తనకూ ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. నేటి మీడియా ప్రభావమే దీనికి ప్రధాన కారణం. ప్రేమ తప్ప మరో లోకం చూపని సినిమాలు యువత ఆలోచనలను పక్కదోవ పట్టిస్తున్నాయి. జీవితం అంటే ప్రేమే అనే ధోరణిలో తయారు చేస్తున్నారు. అలాగే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలపై దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి భావాల నుండి బయట పడి యువతను, నిజమైన ప్రేమను, ప్రేమికులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి సమాజంపై ఉంది.
తెలుసుకోవడం లేదు
ప్రేమని ఈ రోజుల్లో చాలా లైట్‌గా తీసుకుంటున్నారు. ప్రేమలో ఆనందం, సంతోషం, ఉద్రేకం, చిలిపితనం, అంగీకరం, తిరస్కారం, బాధ, త్యాగం ఇలా ఎన్నో ఇమిడి ఉంటాయి. ప్రేమ గురించి తెలుసుకోకుండానే నేడు చాలా మంది ప్రేమలో పడిపోతున్నారు.
– నయనతార

అది ఆకర్షణ మాత్రమే
సినిమా ప్రేమలు తాత్కాలికమైతే, నిజజీవితంలో ప్రేమ యధార్ధం. ఇప్పుడు చిన్నతనంలోనే ప్రేమలో పడుతున్నారు. అదంతా ఒట్టి ఆకర్షణ మాత్రమేనని నా ఉద్దేశ్యం. యుక్త వయసులో, మనసులు వికసించాకనే ప్రేమ అంటే ఏమిటో బోధ పడుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. నా నృష్టిలో అదే నిజమైన ప్రేమ.
– త్రిష
సినీ ప్రేమ వేరు
సినిమాల్లో ప్రేమ ఒకప్పుడు 24 రీళ్లు ఉండేది. ఇప్పుడు 14 రీళ్లకు కుదించుకుపోయింది. అదే నిజజీవితంలో అయితే ప్రేమ జీవితాంతం ఉంటుంది. సినిమాల్లో కథానాయికగా ఉండే ప్రేమ వేరు. జీవితంలో ప్రియురాలిగా, జీవిత భాగస్వామిగా అనుభవించే ప్రేమ నిజం.
– అనుష్క