లక్నోదే అగ్రస్థానం

– రాజస్థాన్‌పై రాహుల్‌సేన గెలుపు
– స్వల్ప ఛేదనలో రాయల్స్‌ చతికిల
– బట్లర్‌, యశస్వి పోరాటం వృథా
స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ (3/25) రాణించటంతో 154 పరుగుల స్కోరును కాపాడుకుంది. సీజన్లో ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. జోశ్‌ బట్లర్‌ (40), యశస్వి జైస్వాల్‌ (44) రాణించినా.. ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌కు పరాజయం తప్పలేదు.
నవతెలంగాణ-జైపూర్‌
లక్నో సూపర్‌జెయింట్స్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. అగ్రజట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై 154 పరుగులను స్కోరు కాపాడుకుంది. పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ (3/25) నిప్పులు చెరగగా..నవీన్‌ ఉల్‌ హాక్‌, మార్కస్‌ స్టోయినిస్‌ (2/28) రాణించారు. 155 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేసింది. 10 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (44, 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్‌ బట్లర్‌ (40, 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం లాంఛనమే అనిపించింది. మార్కస్‌ స్టోయినిస్‌ ఓపెనర్లను అవుట్‌ చేయగా.. అవేశ్‌ ఖాన్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్ల కథ ముగించాడు. సంజు శాంసన్‌ (2) రనౌట్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దేవదత్‌ పడిక్కల్‌ (26), రియాన్‌ పరాగ్‌ (15 నాటౌట్‌) పోరాటం రాయల్స్‌కు విజయాన్ని అందించలేకపోయింది. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (2) నిరాశపరిచాడు. ఓపెనర్లు మినహా ఇతర బ్యాటర్లు వైఫల్యం చెందటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (51, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ (39, 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), నికోలస్‌ పూరన్‌ (29, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అటు లక్నో సూపర్‌జెయింట్స్‌, ఇటు రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఓపెనర్లు మంచి ఆరంభాలను అందించారు. కానీ పరుగుల వేట కష్టమైన పిచ్‌పై మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అంచనాలను అందుకోలేదు. ఈ విషయంలో రాయల్స్‌పై లక్నో పైచేయి సాధించి మ్యాచ్‌తో పాటు అగ్రస్థానం కైవసం చేసుకుంది.
మెరిసిన మేయర్స్‌ : టాస్‌ నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాల జోరుమీదున్న లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. కానీ టీ20 క్రికెట్‌కు తగిన ధనాధన్‌ మంత్ర ఇవ్వటంలో విఫలమయ్యారు. తొలి పది ఓవర్లలో ఒక్క వికెట్‌ చేజార్చుకోని లక్నో సూపర్‌జెయింట్స్‌.. ఎదురుదాడి చేసేందుకు ఆలోచన చేసింది. ఓపెనర్లు కెఎల్‌ రాహుల్‌ (39), కైల్‌ మేయర్స్‌ (51) పోటీపడి నెమ్మదిగా ఆడారు. పవర్‌ప్లే అనంతరం 37/0తో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్‌.. 50 పరుగుల మార్క్‌ను 7.4 ఓవర్లలో,100 పరుగుల మార్క్‌ను 13.3 ఓవర్లలో అందుకుంది. కైల్‌ మేయర్స్‌ సహజశైలికి భిన్నంగా ఆడాడు. కొత్త బంతితో ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మ నిప్పులు చెరిగారు. బౌండరీలకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన మేయర్స్‌ 40 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. కెఎల్‌ రాహుల్‌, మేయర్స్‌ వరుస ఓవర్లలో డగౌట్‌కు చేరుకోగా..చివరి ఓవర్లలో మార్కస్‌ స్టోయినిస్‌ (21, 16 బంతుల్లో 2 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (29, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) లక్నోకు మెరుగైన స్కోరు అందించారు. ఆయూశ్‌ బదానీని బౌల్ట్‌ అవుట్‌ చేయగా.. మేయర్స్‌, దీపక్‌ హుడా (2)ను అశ్విన్‌ సాగనంపాడు. కృనాల్‌ పాండ్య (4 నాటౌట్‌), యుధ్‌వీర్‌ (1 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. మణికట్టు స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ (0/41) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
స్కోరు వివరాలు :
లక్నో సూపర్‌జెయింట్స్‌ : 154/7 (కైల్‌ మేయర్స్‌ 51, కెఎల్‌ రాహుల్‌ 39, నికోలస్‌ పూరన్‌ 29, అశ్విన్‌ 2/23)
రాజస్థాన్‌ రాయల్స్‌ : 144/6 (యశస్వి జైస్వాల్‌ 44, జోశ్‌ బట్లర్‌ 40, అవేశ్‌ ఖాన్‌ 3/25, మార్కస్‌ స్టోయినిస్‌ 2/28)