ఎస్జీటీయూ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో సంకినేని మధుసూదన్ రావు

నవతెలంగాణ – కరీంనగర్ 
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్‌.జి.టి.యూ తరఫున శ్రీ సంకినేని మధుసూదన్ రావు అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం ప్రకటించారు.ముప్పై సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మధుసూదన్ రావు  ప్రభుత్వ ప్రాథమిక విద్యా వ్యవస్థ అభివృద్ధికి అంకితమై పని చేసిన అభ్యర్థి అని వారు తెలిపారు. నేషనల్ ఇంక్రిమెంట్స్ సాధన, పాఠశాలల్లో సర్వీస్ పర్సన్ల నియామకం వంటి ముఖ్యమైన ఉద్యమాల్లో ఆయన పాత్ర గణనీయమని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల ద్వారా ప్రాథమిక విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆయన శాసనమండలిలో గొంతుకవుతారని నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేట్, కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంక్షేమం, నిరుద్యోగుల సమస్యలు, పీఆర్సీలో వేతన వ్యత్యాసాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పన వంటి కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు అభ్యర్థి స్పష్టం చేశారు.పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించేందుకు 13 జిల్లాల్లో ఎస్‌.జి.టి.యూ బలమైన క్యాడర్‌ను కలిగి ఉందని నేతలు తెలిపారు. దాదాపు 20,000 ప్రాథమిక సభ్యులు గెలుపే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు కోసం చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగ బలోపేతానికి, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు శాసనమండలిలో తన వాణిని వినిపించేందుకు కృషి చేస్తానని సంకినేని మధుసూదన్ రావు పేర్కొన్నారు.