– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీన వైఖరిపై నిరసన
పాట్నా : డిమాండ్ల సాధన కోసం బీహార్‌లో వచ్చే నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్‌లు మహా పంచాయత్ నిర్వహించబోతున్నారు. తమ డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో మహా కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాశీన వైఖరులకు నిరసనగా అక్టోబర్ 2న చారిత్రక గాంధీ మైదాన్‌లో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నామని, డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మిథిలేష్ కుమార్ రాజ్ తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన సర్పంచ్‌ల సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మహా పంచాయత్ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శరవణ్ కుమార్, పంచాయతీరాజ్ మంత్రి మురళీ ప్రసాద్ గౌతమ్ నివాసాలను ముట్టడించాలని నిర్ణయించామని రాజ్‌్ వివరించారు. కాగా 19 డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని సర్పంచ్‌లు ఆగస్ట్ నెల మధ్య నుండి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, వివిధ పథకాలకు సంబంధించి నిర్వహించే సమావేశాలను వారు బహిష్కరించారు. ఆగస్ట్ 22, 29 తేదీలలో ధర్నాలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు సమర్పించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పంచాయతీరాజ్ సంస్థల హక్కులు, అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని రాజ్ ఆరోపించారు. నెలవారీ అలవెన్సులు పెంచాలని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం నిధులను నేరుగా పంచాయతీలకే అందజేయాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.