22న కల్లుగీత కార్మికుల మహాధర్నా

Mahadharna of stone masons on 22nd–  పోస్టర్‌ ఆవిష్కరణ
–  కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న హైదరబాద్‌లోని గీత కార్మికుల మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారనీ, తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది చనిపోతున్నారని తెలిపారు. కాళ్ళు, చేతులు విరిగి విగతజీవులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులకు ఒకరిచొప్పున చనిపోతున్నారని తెలిపారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలనీ, సేఫ్టి మోకులు ఇవ్వాలనీ, ద్విచక్ర వాహనాలు అందజేయాలని పలు సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతుందని విమర్శించారు. 2023- 24 బడ్జెట్‌లో గీత కార్మికులకు కేటాయించిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 22 న జరిగే మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ అయిలి వెంకన్న గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో గోప రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దగొని రామ్మోహన్‌ గౌడ్‌, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, కేజీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. వెంకట నరసయ్య, కార్యదర్శి బూడిద గోపి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కన్వీనర్‌ యం. కృష్ణ స్వామి, సీనియర్‌ నాయకులు అబ్బ గాని బిక్షం, పొన్నం రాజయ్య, సీహెచ్‌ రమేష్‌ పాల్గొన్నారు.