పార్లమెంట్‌ ఎదుట మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌

– గళం విప్పనున్న మహిళలు
– ఢిల్లీ సరిహద్దుల్లో, ఢిల్లీ లోపల భారీస్థాయిలో బారికేడ్లు
– కేంద్ర బలగాలతో
కట్టుదిట్టమైన భద్రత
న్యూఢిల్లీ : నేడు కొత్త పార్లమెంటు ఎదుట దేశ మహిళా క్రీడాకారులు తలపెట్టిన మహాపంచాయతీకి సన్నాహాలు పూర్తి అయ్యాయి. దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్ల పిలుపు మేరకు నేడు జరగనున్న మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ నేపథ్యంలో కేంద్రం కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ సరి హద్దు ల్లో, ఢిల్లీ లోపల భారీస్థాయిలో బారికేడ్ల ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరిని పోలీసులు అనుమతించటం లేదు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ను శాంతియుతంగా, క్రమ శిక్షణతో నిర్వహిస్తామని రెజ్లర్లు స్పష్టం చేశారు. 11:30 గంటలకు మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ కోసం మార్చ్‌ శాంతి యుతంగా ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా, మహాపంచాయత్‌కు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి బ్రిజ్‌ భూషణ్‌ హాజరైతే.. దేశంలో నెలకొన్న పరిస్థితు ల గురించి ప్రజలకు స్పష్టమైన సందేశం వెళ్తుందని రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అన్నారు. ‘ఆయనకు ఎవరు మద్దతు పలికినా వారు మాకు వ్యతిరేకమే. ప్రభుత్వం లో అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలి యదు కానీ.. కొంతమంది ఆయనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అది సరికాదు. ఆయన దేశంలోని ఆడబిడ్డలకు హాని చేస్తున్నారు’ అన్నారు.
అంతర్జాతీయ సంఘీభావం
బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ ను అరెస్టు చేయాలని దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన శనివారం 35వ రోజు కొనసాగిం ది. రెజ్లర్ల ఆందోళనకు మద్దతు పెరుగుతున్నది. వారికి అంతర్జాతీయ సంఘీభావం లభించింది. టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ జపాన్‌కు చెందిన రిసాకో కవాయ్ రెజ్లర్లకు మద్దతుగా ప్రకటించారు.
రెజ్లర్లకు యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మద్దతు
బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయా లంటూ స్టార్‌ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ యోగా గురువు రామ్‌ దేవ్‌ బాబా స్పందించారు. కుస్తీ యోధులకు తన మద్దతు ప్రకటించారు. రెజ్లర్లు ఆందోళన చేసే పరిస్థితి రావడం సిగ్గుచేటని, వేధింపులకు పాల్పడే వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఢిల్లీ కోర్టుకు పోలీసులు స్టేటస్‌ రిపోర్టు అందజేత
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన దరఖాస్తుపై ఢిల్లీ పోలీసులు శనివారం స్టేటస్‌ నివేదికను దాఖలు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుచేసిన దాదాపు రెండు వారాల తరువాత ఇది జరిగింది. అంతేకాకుండా, సెక్షన్‌ 164 కింద బాధితుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.