క్లీన్‌ కేరళలో మహిళా సేన

Mahila Sena in Clean Keralaవినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో కేరళ ఎప్పుడూ అగ్రభాగంలోనే ఉంటుంది. కొత్త కొత్త నినాదాలు ఇస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అక్కడ వామపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ‘కుటుంబ శ్రీ’ కార్యక్రమం ప్రారంభించి మహిళ సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. అందులో భాగంగా ‘హరిత కర్మ సేన’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు తమ రాష్ట్రాన్ని హరిత కేరళగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 33,278 మంది హరిత కర్మసేన (హెచ్‌కెఎస్‌) వాలంటీర్లు ఉన్నారు. వీరంతా మహిళలే. ఇంతకీ ఈ సేన ఏం చేస్తుందో ఈరోజు మానవిలో తెలుసుకుందాం…
పెరుగుతున్న వ్యర్థపదార్థాలను అదుపు చేసేందుకు స్థానిక స్వపరిపాలన శాఖ (ఎల్‌ఎస్‌జిడి) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది హరిత కర్మ సేన (హెచ్‌కెఎస్‌) సభ్యులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. హెచ్‌కెఎస్‌ వాలంటీర్లు ప్రతి రోజు తమ పనులను ముగించుకొని ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలను సేకరిస్తారు. ఇది వారికి పార్ట్‌టైం పని మాత్రమే. కాబట్టి మహిళలు తమ పని ముగించుకొని చెత్తను సేకరించే పనిలో భాగస్వామ్యం అవుతారు. రీసైక్లింగ్‌ కోసం ఇళ్లు, సంస్థల నుండి ష్రెడింగ్‌ యూనిట్ల నుండి బయోడిగ్రేడబుల్‌ కాని వ్యర్థాలను సేకరిస్తారు. ‘క్లీన్‌ కేరళ’ (చెత్త రహిత కేరళ) కోసం హెచ్‌కెఎస్‌ పని చేస్తున్నది.
రీసైక్లింగ్‌ చేస్తారు
సేకరించిన వ్యర్థాలను వివిధ విభాగాలుగా విభజిస్తారు. హెచ్‌ఎం వైట్‌, పిపి, హెచ్‌ఎం, ఎల్‌డిప్రింట్‌, బజార్‌, గానీ, బల్బ్‌, పివిసి, స్టీల్‌, ట్యూబ్‌లు, బాటిల్‌, ఈ-వేస్ట్‌, ఎల్‌డి(గ్లూకోజ్‌), బాటిల్‌ క్యాప్స్‌, స్ప్రే బాటిల్‌, ప్లాస్టిక్‌ను విభజించి రీసైక్లింగ్‌ చేస్తారు. పర్యావరణ అనుకూల పదార్థాల తయారీ, వ్యర్థాలను పారవేసే యంత్రాంగ నిర్వహణ, సేంద్రియ ఎరువులను ఉపయోగించి కూరగాయల సాగు, వ్యవసాయం, పర్యావరణ అనుకూల పరికరాలు, కంపోస్ట్‌ తయారీ వంటి పనులన్నీ హరిత కర్మ సేన సభ్యులే చేస్తారు. ప్రతి కుటుంబశ్రీ కార్యకర్త కనీసం 250 ఇళ్లకు వెళ్లి నాన్‌బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాలను సేకరిస్తారు. వినియోగదారుని రుసుం ఆధారంగా సేకరణ ఉంటుంది. నెలకు రూ.60 చెల్లించే ఇళ్లకు వారానికి ఒకసారి వెళ్లి చెత్తను సేకరిస్తారు. రూ.800 చెల్లించే ఇళ్లకు ప్రతిరోజూ వెళ్లి చెత్తను సేకరిస్తారు. ఆ మొత్తాన్ని కలిపి వేతనం రూపంలో వాలంటీర్లందరికీ పంచుతారు.
పది కోట్లు గెలుచుకున్నారు
కేరళలోని మలప్పురం జిల్లా పరప్పనంగడిలో 11 హెచ్‌కెఎస్‌ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మాన్సూన్‌ బంపర్‌ లాటరీలో రూ. పది కోట్లు గెలుచుకున్నారు. దాంతో హెచ్‌కెఎస్‌ కార్యక్రమం దేశ మీడియాను ఆకర్షించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్కడ హెచ్‌కెఎస్‌ పని చేస్తుంది. క్లీన్‌ కేరళ, మహిళా సాధికారిత లక్ష్యంగా ఇది పని చేస్తుంది. 11 మంది హెచ్‌కెఎస్‌ మహిళలు డబ్బులు పోగుచేసి రూ.250కి లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశారు. 11 మందిలో తొమ్మిది మంది రూ.25 చొప్పున, ఇద్దరు రూ.12.50 చొప్పున డబ్బులు ఇచ్చారు. జులై 27 (గురువారం) నాడు తమకు మొదటి బహుమతి వచ్చిందని ఫోన్‌ రావడంతో మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మహిళల బృందం కొనుగోలు చేసిన నాలుగో బంపర్‌ లాటరీ టికెట్‌ ఇది. గతేడాది ఓనం బంపర్‌ లాటరీలో రూ.1,000 గెలుచుకున్నారు. ఇప్పటి లాటరీ డబ్బులో టాక్స్‌ పోను గ్రూపులోని ఒక్కొక్క మహిళా సభ్యురాలికి రూ.63.6 లక్షలు అందుతుంది. అయితే తమ పరప్పనంగడి జిల్లాను పరిశుభ్రంగా మార్చేందుకు ఇంకా కృషి చేస్తామని, తాము ఎప్పటికీ కుటుంబశ్రీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీలో భాగమైన హెచ్‌కెఎస్‌ వాలంటీర్లుగానే ఉంటామని వారు చెబుతున్నారు.
సొంత ఇల్లు కొనుక్కుంటా…
పరప్పనంగడి మున్సిపాలిటీ చైర్మన్‌ ఎ ఉస్మాన్‌ మాట్లాడుతూ.. ‘లాటరీ గెలవడానికి ఈ మహిళలే అత్యంత అర్హులు. లాటరీ గెలుచుకున్న వీరు పరప్పనంగడిని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న హరిత కర్మ సేనకు చెందిన సభ్యులు. కష్టపడి, అంకితభావంతో పనిచేసే బృందం ఇది. లాటరీ ద్వారా అంత డబ్బు వారికి వచ్చినా పరిశుభ్రతలో భాగంగా ఉన్న తమ పనిని ఆపమని చెప్పడమే వారి అంకితభావానికి నిదర్శనం’ అన్నారు. ‘ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వీరు తమకు వచ్చిన లాటరీ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి విభిన్న ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు’ అని హరిత కర్మ సేన అధ్యక్షురాలు షీజా గణేశన్‌ అన్నారు. ‘నాకు సొంత ఇల్లు లేదు. అలాగే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. నా వాటాగా వచ్చిన డబ్బుతో కొత్త ఇల్లు కట్టుకుని నా అప్పులు తీర్చుకుంటాను’ అని హెచ్‌కెఎస్‌ సభ్యురాలు రాధ అంటున్నారు.
– జె.జగదీశ్వరరావు, ఢిల్లీ ప్రతినిధి
ఆర్థిక నిర్వహణలో మహిళల పాత్ర
హరిత కర్మ సేన గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సేన కార్యక్రమాలు ప్రారంభించిన నాటి నుండి ఎలాంటి విమర్శలూ లేకుండా విజయవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో హెచ్‌కెఎస్‌ వాలంటీర్లకు వేతనం కూడా వస్తుంది. దీంతో వారు ఆర్థికంగా నిలబడేందుకు ఒక వేదికగా మారింది. ఫలితంగా కుటుంబ ఆర్థిక నిర్వహణలో మహిళల పాత్ర కూడా పెరిగింది. మరోవైపు గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ఇప్పుడు కేరళలో ఎక్కడపడితే అక్కడ చెత్త కనబడదు. కేరళ స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబి రాజేష్‌ కేరళ హరిత కర్మ సేన విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వామపక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ శ్రీ కార్యక్రమంతో పాటు అనేక మహిళా సాధికారిత ప్రాజెక్టులు చేపట్టామని, అందులో హరిత కర్మసేన కూడా ఒకటని ఆయన చెబుతున్నారు.