దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

– అధికారులకు సీఎస్‌ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఆదివారంనాడామె సచివాలయంలో దీనిపై పలు శాఖలతో కూడిన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జూన్‌ రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని చెప్పారు. గడచిన తొమ్మిదేండ్లలో ఆయా శాఖలు సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ఈ ఏర్పాట్లు ఉండాలని అన్నారు.
దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలను రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖ తయారు చేయాలని చెప్పారు. స్మారక చిహ్నాలు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్‌ అలంకరణ చేయాలని ఆదేశించారు. దీనికోసం సబ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యదర్శి నిర్మల, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ కె. అశోక్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ బి. రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఎం. హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.