పన్ను మినహాయింపులు సులభతరం చేయండి

– ఐటీ శాఖకు సీఏలు, స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆదాయ పన్ను మినహాయింపులను మరింత సులభతరం చేయాలని పలువురు చార్టెడ్‌ అక్కౌంటెంట్లు, స్వచ్ఛంద, దేవాలయ, విద్యా సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయనీ, వాటిని పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మాసాబ్‌ ట్యాంక్‌లోని ఐటీ టవర్స్‌ కార్యాలయంలో కేంద్ర ఆదాయపన్ను శాఖ (మినహాయింపులు) ముఖ్య ప్రధాన కమిషనర్‌ శ్రీమతి రేణు జౌహ్రీ (ఢిల్లీ)తో ‘ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ఆదాయపన్నుశాఖ (మినహాయింపులు) కమిషనర్‌ బీ బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీ కోటేశ్వరమ్మ (జేసీఐటీ), కొరివి సుధ, ధృవ్‌ అష్టా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఐటీ ఫైలింగ్స్‌ లో సమస్యలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేశారు. 2020 నుంచి ఐటీ నిబంధనల్లో మార్పులు వచ్చాయనీ, వాటిపై అందరూ అవగాహన పెంచు కోవాలని కోరారు.

    ఈ సందర్భంగా మెంబర్స్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ తరఫున చార్టెడ్‌ అక్కౌంటెంట్‌ వేణుగోపాలరావు ఆదాయపన్ను శాఖ రిటర్న్స్‌ దాఖలులు ఏర్పడుతున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. పెద్ద సంఖ్యలో హాజరైన ట్రస్టులు, దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థల ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తం చేశారు. దీనిపై రేణుజౌహ్రీ స్పందిస్తూ, కొన్ని నిబంధనలను ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాటు చేసిందనీ, ఐటీ మినహాయింపులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే కొన్ని కఠిన నిబంధనలు విధించినట్టు చెప్పారు. వాటికి అనుగుణంగానే ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాలని సూచించారు. తమ పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరిస్తామనీ, అంతకుమించి ఉన్న అంశాలను కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా సిఫారసు చేస్తామని చెప్పారు. ఆదాయపన్ను చెల్లింపులు పెరగాలనీ, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల పేరుతో నిధుల దుర్వినియోగం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.