చరిత్ర పుటల్లో మల్లు

Mallu in the pages of history– కడవరకు పేదల పక్షాన పోరాటం
– నా మాటే.. తుపాకీ తూటా అన్న స్వరాజ్యం
నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచిన వీర వనిత మల్లు స్వరాజ్యం. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమాలు, అందులోనూ సాయుధ పోరాటాల్లో పాల్గొన్న ప్రముఖ మహిళల్లో మల్లు స్వరాజ్యం అగ్రభాగంలో నిలుస్తారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యంది కీలక పాత్ర. ఎర్ర జెండాను కడదాకా విడువకుండా, భుజానికెత్తుకుని నిత్యం పేద ప్రజల కోసం పోరాడారు. తన జీవితమంతా ఉద్యమమే ఊపిరిగా బతికారు.
నవతెలంగాణ-తుంగతుర్తి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించారు. మల్లు స్వరాజ్యం ఆంధ్ర మహిళా సభ పిలుపు మేరకు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 13 ఏండ్ల వయసులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోకి దిగారు. మొదటిసారి కూలీల పనికి వేతనాల కోసం పోరాటానికి నాయకత్వం వహించారు. 1945-48 సంవత్స రాల్లో సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిం చారు. నాటి నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. ఆమె బాణీ కట్టిన ”ఉయ్యాలో ఉయ్యాలా” పాట ఇప్పటికీ ఉర్రూతలూగి స్తోంది. తుపాకీ చేతపట్టి ఆనాటి జమీందార్లకు వ్యతిరే కంగా పోరాడిన మల్లు స్వరా జ్యం ఒక దళానికి కమాం డర్‌గా ముందుండి నడి చారు. స్వరాజ్యం 1948లో అజ్ఞాత వాసంలోకి వెళ్లారు. సాయుధ పోరాటంలో ఆమె వరంగల్‌, ఆదిలాబాద్‌ దట్టమైన అరణ్యాలలో చాలా రోజులు గడిపారు. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక రజాకార్లు, పెత్తందార్లు 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. అయినా వెరవకుండా గెరిల్లా పోరాటం సాగించారు.
అసెంబ్లీకి పోతే అడ్డుకున్న సెక్యూరిటీ..
1978లో ఎమ్మెల్యే అయిన మల్లు స్వరాజ్యం అసెంబ్లీకి పోతే గేటు వద్ద సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఎందుకంటే ఆమె ఓ ఎమ్మెల్యేలా దర్పం ప్రదర్శించలే.. సాదాసీదా మహిళగా ఉన్నారు.. అందుకే అతను ఆమెను ఎవరో అనుకుని అడ్డుకున్నారు. అది ఆమె జీవన శైలికి ఓ మచ్చుతునక. గెరిల్లా పోరాటమైనా.. ఎమ్మెల్యే అయినా ఆమె జీవితమంతా ప్రజల మధ్యే గడిపారు. మల్లు స్వరాజ్యం ఆత్మకథ ”నా మాటే తుపాకీ తూటా” అన్న పేరుతో 2019లో పుస్తకంగా వచ్చింది. ఆమె వృద్ధాప్యంలోనూ పార్టీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2022 మార్చి 19వ తేదీన హైదరాబాద్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో తెలంగాణ సాయుధ పోరాట చివరి యోధురాలు చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయారు.
ప్రజాప్రతినిధిగా స్వరాజ్యం
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) తరపున నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978, 1983లో మల్లు స్వరాజ్యం రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమ సమయంలోనే తనతో పాటు పోరాటంలో పాల్గొన్న సహచరుడు మల్లు వెంకట నర్సింహారెడ్డిని (వీఎన్‌)1954లో స్వరాజ్యం వివాహం చేసుకున్నారు. కామ్రేడ్‌ వీఎన్‌ సీపీఐ(ఎం) అగ్రనేతగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ నిర్మాణానికి విశేష కృషి చేశారు.