కాలానికి మనిషంటే చిత్రమైన ఇష్టం
కనిపించని ప్రేమతో
ఓ వైపు ఆనాదిగా మెలిగే చుట్టరికమైతే
మరో వైపు అనాథగా మార్చే యుద్ధం.
కాలం
నిత్యపయనంలో
కలుపుకుపోతూన్నట్లుగా కనిపిస్తూనే
కొన్ని ప్రశ్నలని నెత్తికెక్కి భారమౌతున్నా
రోజూ ఏదో ఓ ఆనందంతో
అందంగా కలిసుంటునే అంతలోనే
మౌనంగా దారినీ మాయం చేసి
అడుగులకు పరీక్ష పెడుతున్నా
చేతల్లో నవనవలాడే కమ్మని కల
క్షణాల్లో కళ్లేదుటే కరిగి జారెల్లిపోతూ
కళ్లకు నీరై ఊరుతూ
మనసును ముంచెత్తినా
మనసాకాశంలో
వెన్నెల్ల చీకట్లను తరిమి
ఊహలతో కలను పుట్టించి
తీరకుండా తీపిని చేదు చేస్తున్నా
పడి మొలిచిన ఎన్నో ఇష్టాలుకు
పూసే సంతోషాలతో
పండు ప్రేమను పరిచయం చేసి
దాచుకునే లోగే రాల కొడుతున్నా
సహజ సుందరమైన ఎద లోతు
సున్నితమైన ఆలోచనతో
సూక్ష్మమైన అనుభందంగా
తెంచుకోనేయదు ఏ కోరికలని..
పుట్టిన క్షణం నుండి
ఊపిరాడని కోరికల వేగంలో మనిషికి
కాలం ఎప్పుడు ఏదో ఓ ప్రశ్నతో
రెచ్చకొడుతూ ప్రేమిస్తూనే ఉంది
పెరిగే కొద్దీ మనిషి
కాలాన్ని కోరికలతో కొలిచి కొలుస్తూ
గెలుస్తూనే ఉన్నాడు
కొన్ని కన్నీళ్లు తాగైనసరే బతుకుతునే ఉన్నాడు..
కాల ప్రేమకు పాత్రుడై
కల యోధుడిగా
మనిషే దేవుడికి బహుమతి అయ్యాడు..
– చందలూరి నారాయణరావు,
9704437247