
నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మస్తీష్కంలో పుట్టిన గొప్ప ఆలోచన మన ఊరు మనబడి కార్యక్రమం అని దీంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందింది అని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని కొండాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. నీటి వసతి, టాయిలెట్స్, తరగతి గదులు, మధ్యాహ్నం అందిస్తున్న జావా తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న అదనపు గదుల భవనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి స్థితిగతులు పాఠశాలలో వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకల సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నాము అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు న్యాయమైన విద్య అందుతుందని అన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి అని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరిగినంత అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదని వ్యాఖ్యానించారు. కెసిఆర్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు మంచి విద్య అందించడమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణకు రాగి జావా అందిస్తున్నాము అన్నారు. ఆయనతోపాటు గ్రామ సర్పంచ్ కోదారి దయాకర్ రావు, తదితరులు ఉన్నారు.