ఉత్కంఠకు తెర.. రసమయికే మానకొండూర్

– సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఖరారైన మానకొండూర్ బీఆర్ఎస్ టికెట్
– సంబురాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు..
నవతెలంగాణ-బెజ్జంకి
మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఖరారయ్యారు.దీంతో ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ శ్రేణుల్లో తలెత్తిన ఉత్కంఠకు తెరపడింది. సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏర్పుల రసమయి బాలకిషన్ యథావిధిగా తన స్థానం దక్కించుకోవడంతో మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద మండల బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి,స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు.అనంతరం లక్ష్మినరసింహ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.రాబోయే ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ ను అధిక మేజారీటీతో ఎన్నికయ్యేందుకు శాయశక్తుల కృషి చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.ప్రజాపత్రినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.