మ‌న‌సున్న పంతుల‌మ్మ‌

Manasunna Panthulammaకె.వి.ఎన్‌.ఎల్‌.ప్రసన్నకుమారి… ఉపాధ్యాయి వృత్తి అంటే ప్రేమ. ఆ ప్రేమతోనే పి.జితో పాటు పది డిగ్రీలు చేసినా మూడున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయినిగానే కొనసాగుతున్నారు. అలా అని పిల్లలకు పాఠాలు చెప్పి చేతులు దులుపుకునే టీచర్‌ మాత్రం కాదు. నిరుపేద పిల్లలు చదువుకునేందుకు వస్తున్న అడ్డంకులను గమనించి వారికి అవసరమైన చేయూతనిస్తున్నారు. వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ప్రసన్నకుమారి 1968లో హైదరాబాద్‌లో పుట్టారు. తల్లి కలువల సుజాత, తండ్రి లోహితాశ్వరావు. తాతయ్య(అమ్మ తండ్రి) అప్పట్లో షాబాద్‌ పటేల్‌ పట్వారిగా పని చేసేవారు. ప్రసన్న తండ్రి గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఉద్యోగం చేసేవారు. దాంతో ప్రసన్న చదువంతా అక్కడే కొనసాగింది. ఆయన నాటకాలు కూడా వేసేవారు. రాజకీయ, సాహిత్య సభలకు కూతుర్ని కూడా తీసుకెళ్లేవారు. చిన్నతనం నుండి కులానికి, మతానికి ఆమె తీవ్ర వ్యతిరేకి. జేకేసీ కాలేజీలో చదివే రోజుల్లో వామపక్ష విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐ ప్రభావం ఈమెపై ఉండేది.
ఇష్టంగా చదివేవారు
తన చిన్ననాటి స్నేహితురాలైన సరయు తండ్రి సాంబశివరావు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. ఆయన సీపీఎం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రసన్నలోని అభ్యుదయ భావాలకు ఈ కుటుంబ ప్రభావం కూడా ఓ కారణం. వీరింటికి వచ్చే ప్రజాశక్తి పత్రికను ఆమె చదువుతుండేవారు. అందులో చక్రవర్తి పేరుతో ప్రజావాణిలో లేఖలు, వ్యాసాలు, కవితలు వస్తుండేవి. వాటిని ఇష్టంగా చదువుతుండేవారు. తర్వాత కాలంలో యాదృచ్చికంగా ఆ చక్రవర్తినే ఈమె వివాహం చేసుకొన్నారు. అలాగే కాలేజీలో లెక్చరర్‌గా కత్తి పద్మారావు పాఠాలతో పాటు చెప్పే సామాజిక, రాజకీయ అంశాలు ఆమెను ప్రభావితం చేసేవి. అప్పట్లో యండమూరి, రంగనాయకమ్మ, యద్దనపూడిల నవలలు బాగా చదివేవారు. తల్లి ప్రోత్సాహంతో సంగీతం, వీణ, నృత్యం కూడా నేర్చుకున్నారు. నాటికల్లో కూడా నటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి వ్యాసరచనల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందారు.
కుటుంబానికి అండగా…
డిగ్రీ, డి.సి.పి., డి.పి.యం.(పాలిటెక్నిన్‌) పూర్తి చేసిన తర్వాత ప్రముఖ విద్యావేత్త మంగాదేవి గుంటూరులో స్థాపించిన శ్రీ వేంకటేశ్వరా బాలకుటీర్‌లో చేరారు. కొంత కాలానికి తండ్రి రిటైర్డ్‌ అవ్వడంతో వీరి కుటుంబం హైదరాబాద్‌లోని మేనమామ వద్దకు వచ్చి సంతోష్‌నగర్‌లో స్థిరపడింది. తండ్రికి పెన్షన్‌ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చేది. దాంతో తమ్ముడితో పాటు ఆమె కూడా కాటేదాన్‌లోని బిస్కెట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరారు. దాంతో ఆమె చదువుకు, ఉద్యోగానికి సంబంధం లేకుండా పోయింది. పైగా అది పాత బస్తీ కావడంతో కర్ఫ్యూలు, మత గొడవలు, బంద్‌లు, బస్సులు ఆగిపోవడం లాంటివి నిత్యం ఉండేవి. దాంతో పాత బస్తీ నుండి కాటేదాన్‌ వెళ్ళడం ఆమెకు పెద్ద టాస్క్‌గా ఉండేది. అయినా కుటుంబానికి అండగా నిలబడాలని ఆ ఉద్యోగంలో కొనసాగారు. తర్వాత కాలంలో తెలిసిన వారి సహకారంతో ఇంటికి దగ్గరలోని ఇండో ఇంగ్లీష్‌ హైస్కూల్లో క్లర్క్‌గా చేరారు. అప్పటి వరకు ఉద్యోగం కోసం చేసే ప్రయాణ భారం దగ్గినందుకు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 19 ఏండ్లు అక్కడే పని చేశారు. 2010లో బాలాపూర్‌లోని సిస్టర్‌ నివేదిత హైస్కూల్లో చేరారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే బి.ఎడ్‌., ఎమ్మె ఇంగ్లీష్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే పాఠశాలకు ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రస్ట్‌కు చైర్‌పర్సన్‌గా
హైదరాబాద్‌ వచ్చిన తర్వాతనే రచయిత, సమీక్షకులు, వామపక్ష అభిమాని తంగిరాల చక్రవర్తితో ఆమె వివాహం జరిగింది. ‘నా జననం సహజం కావొచ్చు. కానీ మరణం చరిత్ర సృష్టించాలి, జీవితం ఆదర్శం కావాలి’ అనే భర్త మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయి. స్వప్నించే ఆశయాలు, ఆలోచనలను వాస్తవం చేసే క్రమ శిక్షణ కలిగిన ఈ జంటకు సాయి సుందర్‌ అనే కొడుకు పుట్టాడు. అతను బి.ఇ. ఇంజనీంగ్‌ చేసి సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డాడు. కోడలు పద్మావతి కూడా గ్రాడ్యుయేట్‌. తన తండ్రి మరణానంతరం ఆయన పేరుతో తంగిరాల మెమోరియల్‌ ట్రస్ట్‌ ఏర్పాటుచేసి పాతికేళ్లుగా అవార్డులను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న భర్తకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ ట్రస్ట్‌కు చైర్‌పర్సన్‌గా ప్రసన్న బాధ్యతలు చూస్తున్నారు. కవితలు, కథలు, వ్యాసాలు రాస్తుంటారు. ఆకాశవాణిలో ప్రసంగాలు కూడా చేశారు. 1999లో 3,4,5,9 తరగతుల విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో అభ్యాస పుస్తకాలు రచించారు. అలాగే తంగిరాల స్మృత్యాంజలి పేరుతో మామగారి ప్రధమ వర్థంతి సందర్భంగా ఓ పుస్తకాన్ని ముద్రించారు. అన్వేషణ ఆధ్యాత్మిక అనువాద రచనలు కూడా చేశారు. 2023లో సకలం (కథ, కవిత, వ్యాసరచన, నాటిక, సమీక్ష, ఆత్మకథ) అనే పుస్తకం తీసుకొచ్చారు.
పేద విద్యార్థుల కోసం…
ఉపాధ్యాయురాలిగా పిల్లలకు పాఠాలు చెబితే సరిపోదు. వారి బాగోగులు చూడడం కూడా తన బాధ్యతగా భావించారు ప్రసన్న. అందుకే పేద విద్యార్థులకు తన స్నేహితుల సహకారంతో ఫీజులు కట్టించి చదివిస్తున్నారు. అలాగే పేద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు కూడా అందిస్తున్నారు. అనాథ ఆశ్రమాల్లో ఉండే పిల్లలకు బట్టలతో పాటు ఒకరోజు భోజనం పెట్టి విలువైన పుస్తకాలు వారి లైబ్రేరీలకు అందిస్తుంటారు. అలాగే కారుణ్య సింధు, కరుణశ్రీ సేవా సమితి ఆశ్రయాల్లో పిల్లలకు భోజనం, బట్టలు, పుస్తకాలు ఇచ్చి వారికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు. గురు పూజోత్సవం రోజున తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఆమెను గుర్తుపెట్టుకొని దేశ విదేశాల నుండి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే మనసుకు ఎంతో తృప్తిగా ఉందంటున్నారు.
– సలీమ