అప్రమత్తంగా లేకుంటే… కేరళలోనూ మణిపూర్‌ తరహా హింస

If not careful... Manipur-style violence in Kerala too– రాజకీయ ఆర్థికవేత్త పరకాల హెచ్చరిక
– మోడీ పాలనలో అంతా వినాశనమే
– వారు చెప్పేవన్నీ అబద్ధాలే
– పేదరికం, నిరుద్యోగం,రుణభారంపెరిగిపోతున్నాయి
కొచ్చి : అప్రమత్తంగా లేకుంటే ఈ రోజు మణిపూర్‌లో జరుగుతున్న హింసే దక్షిణాది రాష్ట్రమైన కేరళలోనే జరగవచ్చునని ఆర్థిక రాజకీయవేత్త పరకాల ప్రభాకర్‌ హెచ్చరించారు. కేరళలోని కొచ్చిలో ఎస్‌.రమేశన్‌ స్మారకోపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. పరకాల సతీమణి నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తన భార్య కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆయన బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు సంధించడం గమనార్హం.
మణిపూర్‌లో కొనసాగుతున్న మతపరమైన హింసాకాండను పరకాల ప్రస్తావిస్తూ ‘దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఈ రోజు మణిపూర్‌లో జరుగుతున్నదే ఎక్కడైనా జరగవచ్చు. ఎక్కడైనా, ఏదైనా జరుగుతుంది కానీ కేరళలో జరగదన్న భావనతో ఉండవద్దు’ అని అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకపోవడం, ఎన్నికల్లో మైనారిటీలకు పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు కాషాయ పార్టీ నిరాకరించడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ దేశంలో నివసిస్తున్న మైనారిటీల అవసరమే లేదని వారు స్పష్టం చేస్తున్నారని చెప్పారు.
‘ఇవాళ ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. రేపు క్రైస్తవులు, ఆ తర్వాత జైనులపై జరగొచ్చు. మనం అప్రమత్తంగా లేకపోతే కేరళలోనూ అలా జరగవచ్చు’ అని పరకాల హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, లౌకికతత్వాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. పేదరికం, నిరుద్యోగం, దేశ రుణభారం పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘1947 నుండి 2014 వరకూ మన దేశ రుణం 50 లక్షల కోట్ల రూపాయలు. గత తొమ్మిది సంవత్సరాల్లో అది 150 లక్షల కోట్లకు పెరిగింది. నిరుద్యోగం కూడా పెరిగిపోతోంది. ఇది ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సంక్షోభం. 1990 తర్వాత దేశంలోనే తొలిసారిగా 30 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం మాత్రం తాను 23 కోట్ల మందికి పేదరికం నుండి విముక్తి కల్పించామని చెప్పుకుంటోంది. వరల్డ్‌ హింగర్‌ సూచిక మన దేశానికి అతి తక్కువ ర్యాంక్‌ ఇచ్చింది. ప్రభుత్వమేమో అది తప్పని, ఆ సూచిక ఇచ్చిన వారు భారత వ్యతిరేకులని అంటోంది. వాస్తవాలు మాట్లాడే వారందరూ ప్రభుత్వ దృష్టిలో దేశ వ్యతిరేకులే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దేశంలో పేదరిక నిర్మూలనపై ప్రభుత్వ వాదన నిజమే అయితే మరో ఐదేండ్ల పాటు ఉచిత రేషన్‌ ఇవ్వడంలో అర్థమేముందని పరకాల ప్రశ్నించారు. ‘ఇవాళ ప్రభుత్వం ఏం చెప్పినా నమ్మలేము. ఎందుకంటే అది ఇచ్చే సమాచారం విశ్వసనీయమైనది కాదు. వారు అన్నింటినీ మార్చేస్తారు. గతంలో నాలుగు లైన్ల రోడ్డులో ఒక కిలోమీటరు రోడ్డు పూర్తయితే దానిని కిలోమీటరుగా పరిగణించే వారు. కానీ ఇప్పుడు దానిని నాలుగు కిలోమీటర్లు అంటున్నారు. రోడ్లకు సంబంధించి ఎంతో చేశానని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. మీరు ఏదైనా సమాచారాన్ని అడిగితే అబద్ధాలు చెబుతారు లేదా అసలు చెప్పనే చెప్పరు’ అని అన్నారు.
సరైన సమాచారం లేకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదని పరకాల చెప్పారు. చర్చలు జరపడం, అసమ్మతిని వ్యక్తం చేయడం, వివరణలు ఇవ్వడం, ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించడమే ప్రజాస్వామ్యమని వివరించారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని సస్పెండ్‌ చేయడమో లేదా జైలులో పెట్టడమో ప్రజాస్వామ్యం కాదని చురక వేశారు. మతతత్వంపై పోరాడాలంటే లౌకికవాదానికి కట్టుబడిన వారందరూ సైనికులుగా పనిచేయాలని, అప్పుడే మనం ప్రశాంతంగా నిద్రించగలమని, లేకుంటే ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోలేదని పరకాల చెప్పారు.