మణిపూర్‌ హింసాకాండలో

Manipur violence– 175 మంది మృతి : పోలీసుల నివేదిక
– మార్చురీలో 96 మృతదేహాలు
ఇంఫాల్‌ : మణిపూర్‌ హింసాకాండలో ఇప్పటివరకూ 175 మంది మరణించగా, 1,108 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. సుమారు 33 మంది అదృశ్యమైనట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై కొన్ని కీలక గణాంకాలను పోలీసులు విడుదల చేశారు. 175 మందిలో ఇప్పటికీ గుర్తించని 96 మృతదేహాలు మార్చురీలో ఉన్నట్టు చెప్పారు. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం.. ఈ హింసలో కనీసం 5,172 అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయి. వాటిలో 4,786 నివాసాలు, 386 మతపరమైన ప్రదేశాలు (254 చర్చిలు, 132 దేవాలయాలు) అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. హింస ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668 ఆయుధాలు లూటీకి గురయ్యాయనీ, వాటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని అన్నారు.
అలాగే 15,050 మందుగుండు సామగ్రి, 400 బాంబులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలో కనీసం 360 అక్రమ బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశారు.బిష్ణుపూర్‌ జిల్లాలోని ఫౌగక్‌చావో ఇఖారు నుంచి చురచంద్‌పూర్‌ జిల్లాలోని కాంగ్‌వై వరకు బారికేడ్‌లను తొలగించామనీ, జాతీయ రహదారులపై భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. 32, 2 నెంబర్ల జాతీయ రహదారులపై రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు 9,332 కేసులు నమోదు కాగా, 325 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు.