కార్పొరేట్ల కోసమే మణిపూర్‌ హింస

– సహజ వనరులను దోచిపెట్టే కుట్ర
– రిజర్వేషన్ల పేరుతో కుకీ, మైతీ తెగల మధ్య విద్వేషాల సృష్టి
– ఎస్వీకే వద్ద ధర్నాలో సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్రలో భాగంగానే మణిపూర్‌లో రిజర్వేషన్ల పేరుతో కుకీ, మైతీ తెగల మధ్య హింసను మోడీ సర్కారు సృష్టించిందని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నేతలు విమర్శించారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ ప్రజాతంత్ర వాదులంతా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆ మూడు సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్‌లో హింసను అరికట్టాలనీ, సాధారణన పరిస్థితులను తీసుకురావాలని కోరుతూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ యూనియన్‌ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడారు. 30 లక్షల జనాభా ఉన్న అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రంలో హింసను నివారించలేని డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఎందుకని ప్రశ్నించారు. కార్పొరేట్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు మణిపూర్‌ రాష్ట్రంలో ఆధిపత్యభావజాల శక్తులకు కొమ్ముకాస్తూ హింసను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. విలువైన సహజ వనరుల మీద కన్నేసి కుకీలు, నాగాల హక్కుల మీద దాడి చేస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు బయటి ప్రపంచానికి తెలియకుండా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిందని విమర్శించారు. ఓవైపు ప్రపంచ దేశాల వేదికపై భారతదేశం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెబుతున్న మోడీ…మణిపూర్‌ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించాలంటే ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. అక్కడ ఉన్న బీరేన్‌సింగ్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు, గిరిజనులకు ప్రత్యేకంగా ఉన్న హక్కులన్నింటినీ తొలగిస్తూ పోతున్నదని విమర్శించారు. బతుకుదెరువు దెబ్బతినటంతో కుకీలు, నాగాలు పెద్దఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని తెలిపారు. అందులో పాల్గొంటున్న మహిళలపై సామూహిక లైంగికదాడులు చేస్తూ, యువకుల తలలు నరికి వేలాడదీస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు మాట్లాడుతూ..బీజేపీ తన రాజకీయ ప్రయోజనం, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చడంలో భాగంగానే మణిపూర్‌ హింసాకాండను ప్రేరేపిస్తోందని విమర్శించారు. బీజేపీ మతతత్వ, కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు దిగొచ్చి మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ.. ఓ సైనికుడి భార్యకే పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొనడం సిగ్గుచేటన్నారు. బీజేపీ చెబుతున్న దేశభక్తి, భారత్‌మాతాకి జై నినాదాలన్నీ బూటకమేనని ప్రస్తుత ఘటనలను చూస్తే ఇట్టే అర్థమవుతున్నదన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి, ఎస్వీ రమ, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి.పద్మ మాట్లాడుతూ.. మహిళలను వివస్త్ర చేయడం ఈ ఒక్క ఘటనే కాదు..ఇలాంటివి వందల సంఖ్యలో జరిగాయని చెబుతూ మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆ రాష్ట్రంలో మహిళలకు, కుకీలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. బేటీ పడావో..బేటీ బచావో అని నినదిస్తూ మహిళలపై ఈ దాడులేంటని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్‌ నాయకులు జంగారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌, సీఐటీయూ సీనియర్‌ నాయకులు రాజారావు, ఆఫీస్‌ బేరర్లు ఎస్‌.వీరయ్య, జె.మల్లిఖార్జున్‌, జె.వెంకటేశ్‌, మధు, రమేశ్‌, వీరారెడ్డి, చంద్రశేఖర్‌, ఈశ్వర్‌రావు , ఎం.వెంకటేశ్‌, బీరం మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.