– మార్క్స్ విగ్రహాన్ని ఆవిష్కరించిన డాక్టర్ స్వామి అల్వాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలో మానవాళి దోపిడీ విముక్తి కి ఏకైక పరిష్కారం మార్క్సిజం మాత్రమేనని ప్రముఖ అంబేద్కర్‌వాది ప్రజావైద్యులు డాక్టర్ స్వామి అల్వాల్ అపరాజిత్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తిలక్ నగర్ సంజీవయ్య నగర్‌లో ప్రపంచ తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త కారల్ మార్క్స్ విగ్రహాన్ని శతాబ్ది భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1818 మే5న మార్స్క్ జన్మించారని చెప్పారు. 1848 లో కమ్యూనిస్టు ప్రణాళిక రాశారని తెలిపారు. దోపిడీ లేని సమసమాజ స్వాప్నికుడిగా ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. మనువాదులు ఆయన్ను విదేశీయుడంటూ విమర్శించటం విచారకరమన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ డాక్టర్ స్వామి అంబేద్కర్ శతాబ్ది భవనంలో తన సొంత ఖర్చులతో కారల్ మార్క్స్ విగ్రహం నెలకొల్పడం అభినందనీయమన్నారు.